కట్టంగూర్, జూలై 14: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతోందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారిక రికార్డుల్లో చూపిస్తున్న కరెంట్ వేళలకు, క్షేత్రస్థాయిలో అందుతున్న కరెంట్ సరఫరాకు పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పామనగుండ్ల విద్యుత్ సబ్ స్టేషన్‌లోని లాగ్బుక్తోపాటు పక్కనే ఉన్న పంట పొలాలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం చిరుమర్తి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌లో రోజుకు 17 నుంచి 18 గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్, మరో 6 నుంచి 7గంటల సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తునున్నట్లు తప్పుడు లెక్కలు రాస్తున్నారని, వాస్తవంగా రైతులకు రోజుకు 8 నుంచి 10 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. బ్రేక్ డౌన్ కారణంగా గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్నా, రికార్డుల్లో మాత్రం కొద్ది నిమిషాల అంతరాయం మాత్రమేనని నమోదు చేస్తున్నారని విమర్శించారు. లో వోల్టేజీ, తరచుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం వల్ల మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయన్నారు.
పై అధికారుల ఆదేశాల మేరకే రికార్డుల్లో అలా నమోదు చేస్తున్నట్లు ఆపరేటర్లు చెప్పినట్లు చిరుమర్తి పేర్కొన్నారు. యాప్ విధానంతో రైతులకు యూరియా, ఎరువులు సకాలంలో అందడం లేదని, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల రక్తం పొలాల్లో చల్లాలంటూ దారుణంగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి ఆంధ్రాకు నీళ్లు పారుతుంటే చేతులు నలుపుకుంటూ కూర్చొన్నాడని ధ్వజమెత్తారు. కాళేశ్వరం, ఏఎమ్మా ర్పీ వంటి సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వ సక్రమంగా వినియోగించడం లేదని, కాల్వలకు నీరందక.. చెరువులు ఎండి భూగర్భ జలాలు పడిపోతున్నాయన్నారు.
తాగునీటి సమస్య కూడా త్రీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు, యూరియా. ఎరువులు అందించాలని చిరుమర్తి డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, పామనగండ్ల సర్పంచ్ వడ్డె మాధవీ సైదిరెడ్డి, ఉప సర్పంచ్ బండారు కృష్ణ, వార్డు సభ్యులు బం డారు విజయ్‌కుమార్, పొం దు సైదులు, బండారు అం జయ్య, నాయకులు ఆచారి మహేశ్, మహేందర్‌రెడ్డి, బండారు మహేశ్ తది తరులు ఉన్నారు.