నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేదికలపై అలాయ్ బలాయ్, నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అని చేసుకునే పొగడ్తలన్నీ ఉత్తవేనా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి మాత్రం ఎంత నటించినా సరైన సమయం వస్తే అసలు వాస్తవమేంటో తేటతెల్లం కాక మానదనట్లుగా పరిస్థితి నెలకొంది. అందుకు నాగార్జునసాగర్ పర్యటన తాజా ఉదాహరణగా నిలిచింది. ఇటీవల పలు వేదికలపై వీరిద్దరూ పైకి మాత్రం నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుకున్న విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి సమీక్షా సమావేశాల్లో పాల్గొంటుండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సైతం అంతా బానే ఉందనుకున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు అలాగే ఉందని తాజా పరిస్థితులు బహిర్గతం చేసినైట్లెంది.
నల్లగొండ ప్రతినిధి, జూలై30(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్‌లో గేట్లు ఎత్తడానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఇద్దరూ హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉంది. మంత్రి కోమటిరెడ్డి ఇన్చార్జి మంత్రితో కలిసి నిర్ణీత సమయానికే అక్కడికి వచ్చారు. ఉత్తమ్ మాత్రం రాలేదు. 40 నిమిషాల పాటు వేచి చూసినా ఉత్తమ్ జాడే లేదు. దీంతో అప్పటి వరకు ఎయిర్‌పోర్ట్‌లో తన కారులోనే వేచి చూస్తున్న కోమటిరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. ఇదేం పద్ధతి.. ఇంత సేపు వెయిట్ చేయించడం బాలేదు. నేనూ సీనియర్ మంత్రిని, ఇది అవమానకరమే అన్న ధోరణి వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. గంట ఆలస్యంగా వచ్చి కోమటిరెడ్డికి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో చేసేదేమీ లేక లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగర్‌కు వచ్చేశారు. తర్వాత సాగర్, హుజూర్నగర్, నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో రేషన్‌కార్డుల పంపణీలోనూ పాల్గొన్నారు. కోమటిరెడ్డి అలిగి వెళ్లిపోవడం వల్ల వీటితో పాటు సాగర్ గేట్లు ఎత్తే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వాస్తవంగా ఉమ్మడి జిల్లా మీద ఇద్దరూ మంత్రులు తమ ఆధిపత్యం కోసం ఆది నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఉత్తమ్, కోమటిరెడ్డిల మధ్య ఎప్పుడు పెద్దగా సత్సంబంధాలు లేవు. జిల్లాలో పార్టీపై పట్టు కోసం నిత్యం ఆధిపత్య పోరు నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులు కోసం వీరిద్దరి ఫ్యామిలీల మధ్య పోరు నడిచింది. వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి కూడా ఇవ్వాలని ఉత్తమ్ మెలిక పెట్టినట్లు ప్రచారం సాగింది. మొదట్లో సీఎం రేవంత్‌రెడ్డి పంచన చేరిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లాలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఆరంభంలో బానే పావులు కదిపారు. తర్వాత పరిణామాలతో క్రమక్రమంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాబల్యం తగ్గుతున్నట్లు చర్చ మొదలైంది. కోమటిరెడ్డిని లైట్ తీసుకోవడం మొదలు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా జిల్లా ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్లారు. ఈ మధ్యలోనే మంత్రి పొంగులేటి ఎంట్రీ కావడంతో ఎమ్మెల్యేలూ మంత్రి కోమటిరెడ్డిని సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. అందుకే ఇటీవల మంత్రి కోమటిరెడ్డి పర్యటనల్లోనూ జిల్లా ఎమ్మెల్యేలు పెద్దగా కనిపిస్తలేరని సమాచారం. ఇటీవల నల్లగొండలో ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయ నూతన భవనం ఓపెనింగ్‌లో ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్‌తో కలిసి కోమటిరెడ్డి పాల్గొంటే దీనికి ఒక్క బాలునాయక్ తప్ప ఇతర ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. అప్పటి వరకు నల్లగొండలోనే ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్, ఇద్దరూ ఎంపీలు, మిగతా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా లంచ్ తర్వాత జరిగిన ఓపెనింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇటీవల దేవరకొండలో స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండానే ఇన్చార్జి మంత్రితో కానిచ్చేశారు.