– అన్నారంలో పింఛన్ పంపిణీలో అవకతవకలు
– ప్రతి వ్యక్తికి పింఛన్ లో రూ.16 ఇవ్వడంలో గోల్ మాల్
తుంగతుర్తి, మార్చి 30 : గ్రామాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియలో ఇష్టారాజ్యంగా నెలకు వేల రూపాయలు ఫించన్ దారులు నష్టపోతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూశాయి. ఇందుకు తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 800 పై చిలుకు ఫించన్ దారులు ప్రతినెల పింఛన్లు తీసుకుంటున్నారు. ఒక్కరికి రూ.2,016, రూ.4,016లు పంపిణీ చేయాల్సి ఉండగా సంబంధిత పోస్టల్ అధికారి కొందరికి రూ.16 ఇవ్వకపోవడం, మరికొందరికి రూ.6 చిల్లర లేవని ఇవ్వకపోవడం, మరికొంతమంది నెలనెల దాచుకున్న డబ్బులు ఎఫ్డీ రెండు సంవత్సరాలు గడుస్తున్న, పూర్తయిన, నేటి వరకు కూడా వారి కుటుంబానికి డబ్బులు అందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా అన్నారం గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ కనీసం పింఛన్ దారుల పాస్ బుక్ లు కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు. ఒక్క గ్రామంలోనే పింఛన్ దారుల డబ్బులు వేల రూపాయలు మిగిలిచ్చుకుంటున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనితో మొత్తం మండలంలో ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఫించన్ దారులు నష్టపోతున్నారు. గ్రామాల్లో ఇది ఎందుకు జరుగుతుందని.. ఏ విధంగా జరుగుతుందని ప్రశ్నించే వారే లేకపోయారు. మండలంలో వందల మంది ఫించన్ దారులకు జరుగుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా పోస్టల్ ఉన్నత శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పేద పింఛన్ దారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా పోస్టల్ ఉన్నతాధికారి బుచ్చిబాబున్ను ఫోన్లో వివరణ కోరగా తమకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.