కట్టంగూర్, సెప్టెంబర్ 23 : ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే పోషణ్ అభియాన్ కార్యక్రమం పేదలకు వరం లాంటిదని ఐసీడీఎస్ సీడీపీఓ అశ్ర అంజుం అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలు, సమాక్య సభ్యులతో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పౌష్టికాహర లోపంతో గర్భిణులు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని, ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 16 వరకు మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణుల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో పౌషికాహారం అందిస్తున్నట్లు చెప్పారు.
పోషణ లోపం వల్ల ఇబ్బందులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై మహిళలకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవడంతో పాటు వాటి వల్ల కలిగే లాభాలను మహిళలకు వివరించారు. అనంతరం పోషణ్ అభియాన్ మాస ఉత్సవాల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ స్వరూపరాణి, సూపరింటెండెంట్ చింతమల్ల చలపతి, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు బూరుగు శారదారాణి, పద్మావతి, అరుణశ్రీ, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.