రామగిరి, ఆగస్టు 20 : రాజీవ్ గాంధీ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం నల్లగొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డికి చుక్కెదురైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. వందల సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 97కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీలో(పీపీపీ మోడల్) విలీనం చేయడాన్ని తప్పుబట్టారు.
పాలిటెక్నిక్ కళాశాలల స్వయం ప్రతిపత్తిని, ఉనికిని దెబ్బతీసేలా ఉన్న జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల పేద విద్యార్థులపై ఫీజుల భారం పడతుందని, పేద, గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఇలాంటి ప్రయోగం విఫలమైనప్పటీకీ తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని నిలదీశారు. తమ డిమాండ్ల నెరవేరే వరకు పోరా టం కొనసాగిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణ నెలకొంది.