నల్లగొండ, సెప్టెంబర్ 30 : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ లపై రాజకీయ పార్టీ నాయకులకు వివరించారు. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రతిపాదించడం జరిగిందని, మొదటి విడత నల్లగొండ, దేవరకొండ డివిజన్లకు సంబంధించి 18, రెండో విడత చండూరు, మిర్యాలగూడ డివిజన్లకు సంబంధించి 15 జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదించినట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదించగా, మొదటి విడుత నల్లగొండ, చండూరు డివిజన్లకు సంబంధించి 318 గ్రామపంచాయతీలు, రెండో విడతన మిర్యాలగూడ డివిజన్లోని 282 గ్రామ పంచాయతీలు, మూడో విడుత దేవరకొండ డివిజన్ పరిధిలోని 269 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్టీల ఏజెంట్లు పోలింగ్ స్టేషన్లోకి ఉదయం 6 గంటలకు వెళ్లాలన్నారు. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించమని, మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలులో లేదని, అట్టి ఏరియాలో అభివృద్ధి పనులు అధికారులతో నిర్వహించుకోవచ్చని తెలిపారు.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కొత్తగా ఎటువంటి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గ్రౌండింగ్ వంటివి ఉండవన్నారు. తాగునీరు, విద్య, వైద్యంకు సంబంధించి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ప్రార్థనా మందిరాలలోకి ఎటువంటి పార్టీ జెండాలతో ప్రవేశం లేదని చెప్పారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రసారం చేస్తే డీపీఆర్ఓ ద్వారా తగు చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రాజకీయ పార్టీల మీటింగులు, ర్యాలీలు పర్మిషన్ లేకుండా చేయరాదని తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రసారం చేయరాదని సంబంధిత రాజకీయ పార్టీ నాయకులకు తెలిపారు. 48 గంటలు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని, రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా జిల్లా పాలన యంత్రాంగానికి సహకరించాలని కోరారు. సమావేశానికి స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, కాంగ్రెస్ పార్టీ నుండి గుమ్మల మోహన్ రెడ్డి, మాధవరెడ్డి, సిపిఐఎం తరఫున నర్సిరెడ్డి, బిజెపి నుండి లింగస్వామి, బిఎస్పీ నుండి యాదగిరి, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అహ్మద్, అద్దంకి రవి, బీఎస్పీ నుండి భీం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
Nalgonda : స్థానిక ఎన్నికల సజావుకు రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి