నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం.. దేశానికే దిక్సూచిగా పాలన అందించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు సిట్ అక్రమంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భగ్గుమన్నారు. కేసీఆర్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సిట్ బృందం విచారించనున్న నేపథ్యంలో ఆదివారం తెల్లతెల్లవారుజాము నుంచే పార్టీ శ్రేణులు చలిని లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. పట్టణాలు, గ్రామాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
తెలంగాణ జాతిపిత కేసీఆర్ జిందాబాద్… సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్… అంటూ నినాదాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు మానుకోవాలని హెచ్చరించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని పల్లెల్లో ఉదయం 9 గంటలకే బీఆర్ఎస్ శ్రేణులంతా రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. కొన్ని చోట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర చేశారు. జేబులకు నల్లబ్యాడ్జీలు, చేతుల్లో నల్లజెండాలతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. పట్టణాల్లోని కూడళ్లల్లో రాస్తారోకో చేశారు. సూర్యాపేటలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తిర్మలగిరిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు.
కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో వందలాది మంది విజయవాడ-హైదరాబాద్ హైవేపై బైక్ ర్యాలీ నిర్వహించారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సెంటర్లో ఆందోళన చేపట్టారు. చిట్యాలలోనూ చిరుమర్తి లింగయ్య పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేశారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, పార్టీ రాష్ట్ర నేత పాల్వాయి స్రవంతి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనకు దిగారు.
నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడానికి యత్నించారు. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. హాలియాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రబాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైవేపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలేరు మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. సునీతామహేందర్‌రెడ్డి స్వయంగా నల్లచీర ధరించి ఆందోళనలో పాల్గొన్నారు.