భువనగిరి కలెక్టరేట్, మే 5 : అక్రమంగా తరలిస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపి, కఠిన చర్యలు చేపడుతున్నట్లు డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామ పరిధిలోని రోమా ఇండస్ట్రీలో 2024-25కు సంబంధించి 74 కేసుల్లో పట్టుబడ్డ రూ.10కోట్ల 5లక్షల 6వేల750 విలువైన 2010.135కేజీల గంజాయిని సోమవారం కాల్చివేసి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సికింద్రాబాద్, రూరల్, ఖాజీపేట డివిజన్ల పరిధిలో నమోదైన 74 కేసులకు సంబంధించి పలు కేసుల్లో ఎక్కువ మొత్తంలో గంజాయిని స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. గతానికి భిన్నంగా గంజాయిని అధిక మొత్తంలో పట్టుకోవడంలో సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు.
గంజాయి అక్రమ రవాణాకు విక్రయదారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని, వారి వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాన్ని రచించి పోలీసులు కట్టడి చేస్తున్నారని ప్రశంసించారు. గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతన్నట్లు ఆమె పేర్కొన్నారు. 2024-25 ఏడాదిలో ఇప్పటి వరకు సికింద్రాబాద్ పరిధిలో 49 కేసుల్లో రూ.7,09,61,450 విలువైన 1419.229 కేజీలు, సికింద్రాబాద్ రూరల్ పరిధిలో 5 కేసుల్లో రూ.50,42,100 విలువ గల 100.842 కేజీలు, ఖాజీపేట డివిజన్లో 20కేసుల్లో రూ.2,45,03,200విలువ గల 490.064 కేజీల గంజాయిని ధ్వంసం చేశామని చెప్పారు.
గంజాయి, మత్తు పదార్థాల రవాణా, నియంత్రణ, అసాంఘిక, శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా సికింద్రాబాద్, ఖాజీపేట రైల్వేస్టేషన్లతో పాటు చర్లపల్లి, జనగాం, భువనగిరి తదితర రైల్వేస్టేషన్లలో కొత్తగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ రూరల్, అర్బన్ రైల్వే డీఎస్పీలు కె.శ్రీనివాస్‌రావు, జావిద్, ఖాజీపేట డీఎస్పీ టి.కృపాకర్, సికింద్రాబాద్, కాజీపేట రైల్వే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.