సూర్యాపేట టౌన్, డిసెంబర్ 6 : సూర్యాపేట జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధ కాండను సాగించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన క్రమంలో వారిని పరామర్శకు బయల్దేరిన ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను శనివారం ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. కొన్ని మండలాల్లో ముందస్తు అరెస్టులు చేపట్టారు.
రోజంతా స్టేషన్లో ఉంచి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కోదాడ, నడిగూడెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, హుజూర్నగర్, మేళ్లచెర్వు, అర్వపల్లి, పెన్పహాడ్, నాగారం, నూతనకల్, తుంగుతుర్తి మండల్లాలో అరెస్టుల పర్వం సాగింది. అక్రమ అరెస్టులను నిరసిస్తూ స్టేషన్ల ఆవరణలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాక ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూస్తుండడం అన్యామని మండిపడ్డారు. ప్రజా పాలన పేరుతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.