సూర్యాపేట టౌన్, మే 01 : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మే నెల 1వ తేది నుండి 31వ తేదీ వరకు నెల రోజుల వరకు “30 పోలీస్ యాక్ట్” అమల్లో ఉంటుందని ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. అనుమతులు లేకుండా అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిం చేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. సోషల్ మీడియా నందు అనవసరమైన విషయాలను, అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై కేసులను నమోదు చేయబడతాయని తెలిపారు. బాణాసంచా, డీజేలు ఉపయోగించవద్దన్నారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.