గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడనుంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా బీఆర్ఎస్ వేడుక జరుగనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయా నియోజకవర్గాల వారీగా పండుగ వాతావరణంలో ప్లీనరీలు నిర్వహించనున్నారు. వీటిని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు ఇప్పటికే నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్లీనరీ ఏర్పాట్లపై సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. ప్లీనరీకి బీఆర్ఎస్ ప్రతినిధులతోపాటు వివిధ కమిటీల బాధ్యులు హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 3,500మంది పాల్గొననున్నారు. మంగళవారం ఉదయమే గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ జెండాలను ప్రజాప్రతినిధులు, నేతలు ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి నేరుగా స్థానికంగా జరిగే ప్లీనరీకి తరలిరానున్నారు. ఇందులో బీఆర్ఎస్ ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్రంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై చర్చించనున్నారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. ఇప్పటికే మండలాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా కొనసాగుతుండగా ప్లీనరీలతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ కనపడనుంది.
– సూర్యాపేట, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీలు నిర్వహించనున్నారు. పార్టీ నియమించిన ఇన్చార్జీలు, ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగనున్నాయి. ఉదయం 8గంటలకే గ్రామాలు, మున్సిపాలిటీల్లో పండుగ వాతావరణం ఉండనుంది. గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో బీఆర్ఎస్ జెండాలను ఎగురవేయనున్నారు. గ్రామస్థాయిలో జెండా పండుగ ముగిసిన తర్వాత ఉదయం 10గంటలకు నియోజకవర్గ ప్లీనరీకి చేరుకోనున్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతుబంధు కన్వీనర్లు, పార్టీ మండలాధ్యక్షులు, కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ బాధ్యులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితర ఇతర బాధ్యులు కుటుంబ సభ్యులతో హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3,500 మందితో ప్రతినిధుల సమావేశం జరగనుంది.
వేదికలు ఇవే..
ఆలేరుకు సంబంధించి యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాల్, భువనగిరికి సంబంధించి భువనగిరి పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో ప్లీనరీ జరగనుంది. ప్రతినిధులు, పార్టీ శ్రేణులు గులాబీ రంగు చొక్కా, కండువాలతో పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఉదయం 10గంటలకు ప్లీనరీ ఆయా నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లాలో ప్లీనరీ చివ్వెంల మండలం బీబిగూడెం సమీపంలోని తోటలో నిర్వహించనుండగా కోదాడలో గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్‌హాల్, హుజూర్‌నగర్‌లో కౌండిన్య ఫంక్షన్ హాల్, తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని అంగ డి నిర్వహించే గ్రౌండ్, నల్లగొండలో లక్ష్మి గార్డెన్స్, మిర్యాలగూడ శ్రీమన్నారాయణ గార్డెన్స్, చండూరులోని ధనలక్ష్మి ఫంక్షన్‌హాల్, హాలియా లక్ష్మీ నర్సింహాగార్డెన్ , నకిరేకల్‌లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో ప్లీనరీలు జరుగనున్నాయి.
ఒక్కో మండలానికి ఒక్కో కౌంటర్
సమావేశానికి రాగానే కౌంటర్ల వద్ద వివరాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో మండలానికి ఒక్కో కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడే ప్రత్యేక బుక్లెట్ ఇవ్వనున్నారు. సమావేశంలో చర్చించిన నోట్స్, ముఖ్య విషయాలు నోట్ చేసుకోవడానికి ఓ బుక్, పెన్నుతోపాటు పార్టీ కండువా ఇస్తారు. వేదికపై సుమారు 50 మంది ప్రతినిధులు ఆసీనులు కానున్నారు. ముఖ్యమైన వక్తలు మాత్రమే ప్రసంగిస్తారు. మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పా టు చేస్తారు. వేసవి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
విజయవంతంగా ఆత్మీయ సమ్మేళనాలు..
జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల పరిధిలో ఆయా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జోరుగా నడుస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మండలానికి రెండు క్లస్టర్లుగా విభజించి, ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతున్నారు. ఇందులో అన్ని గ్రామాల సర్పంచులు, అధ్యక్షులతో మాట్లాడిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటి..? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది..? అని మనసులో మాటను చెప్పిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న చిన్నచిన్న విభేదాలను పోగొడుతున్నారు. ఒక్కో సమావేశానికి వెయ్యి నుంచి రెండు వేల మంది హాజరు అవుతున్నారనంటే ఎంత విజయ వంతంగా కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఫొటో ఎగ్జిబిషన్
ప్లీనరీల్లో నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఫ్లెక్సీల రూపంలో ఫొటోలను ప్రదర్శించనున్నారు. చెక్ డ్యామ్ లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, పాఠశాలలు, పల్లె ప్రకృతి, వైకుంఠ ధామాలు, కాళేశ్వరం జలాలు, రోడ్లు, బ్రిడ్జిలు, కుల సంఘాల భవనాలు తదితర అభివృద్ధి ఫొటోలను ప్రతినిధుల సభలో ప్రదర్శించనున్నారు.
రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర వైఫల్యాలపై చర్చ..
రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్లీనరీలో చర్చించనున్నారు. గతంలో వెనుకబడిన తీరు, ఇప్పుడు సాధించిన విజయాలను విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. రాష్ర్టానికి బీజేపీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, అవలంబిస్తున్న విధానాలపై వివరించనున్నారు. రాష్ట్రంపై కేంద్రం ఉద్దేశపూర్వకంగా వెళ్లగక్కుతున్న అక్కసుపై వక్తలు ప్రసంగాల రూపంలో తెలియజేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఆవిర్భావం ప్రాధాన్యతను చెప్పనున్నారు. భవిష్యత్‌లో ఎలా ముందుకు నడవాలి..? ఇంకా ఏం చేయాలి..? పార్టీని ఎలా ముందుకు నడిపించాలి..? తదితర అంశాలపై మాట్లాడనున్నారు. చివరిగా 12 అంశాలపై తీర్మానాలను ఆమోదించనున్నారు.