రామగిరి, జులై 05 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఏరియా హాస్పిటల్స్ ను ప్రభుత్వం బలోపేతం చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని పానగల్, మాన్యం చిలక, లైన్ వాడ ఆస్పత్రులను ఐద్వా ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాన్యం చిలుక హాస్పిటల్కి నిత్యం 150 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నా సొంత భవనం లేదన్నారు. గాలి, వెలుతురు లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఒకరే డాక్టరు ఉండడం వల్ల అందరికీ చూడకుండా ఫార్మసిస్ట్ మందులను ఇచ్చి పంపిస్తున్నట్లు తెలిపారు.
మూడు హాస్పిటల్స్ లో కూడా సిబ్బందికి మూడు నెలల నుడి వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. సిబ్బందికి ప్రతి నెల కూడా వేతనాలు అందించాలని, మందులు అందుబాటులో ఉంచాలని, మన్యం చిలుక ఆస్పత్రికి నూతన బిల్డింగ్ కేటాయించిన, నిధుల లేమితో భవనం అసంపూర్తిగానే ఉందన్నారు. నిధులు విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న భవనాన్ని త్వరగా పూర్తి చేసి, అదనంగా మరో డాక్టర్ను కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, శృతి, శ్రావ్య పాల్గొన్నారు.