రామగిరి, జూన్ 15 : పరిశోధనలకు అవకాశం కల్పించేలా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో యూజీసీ నిబంధనల మేరకు శనివారం నిర్వహించిన తొలి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఇప్పటి వరకు ఎంజీయూలో యూజీసీ నెట్, జేఆర్ఎఫ్, సెట్, నెట్ ఉన్న అభ్యర్థులకు నిబంధనల మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించారు. అయితే.. కొత్త నిబంధనల ఫ్రకారం సెట్, నెట్‌తోపాటు ఆయా కోర్సులకు సమానమైన పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు నేరుగా ఎంట్రన్స్ నిర్వహించి ప్రవేశం కల్పించేలా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేశారు.
దీంతో ఆన్లైన్లో 400 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆకుల రవి వెల్లడించారు. వారికి ఎంజీయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం వేర్వేరుగా జరిగిన పరీక్షకు పేపర్-1 రిసెర్చ్ మెథడాలజీ అన్ని సబ్జెక్టులకు ఒక్కటే ఉండగా 400 మందికి 334 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 66 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2 సబ్జెక్టు వారీగా పరీక్షలు నిర్వహించగా.. బిజినెస్ మేనేజ్మెంట్లో 171మందికి 146 మంది, బయోటెక్నాలజీలో 22మందికి 19మంది, కామర్స్‌లో 94మందికి 81మంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్లో 50మందికి 43మంది,
బయోకెమిస్ట్రీలో 10మందికి ఏడుగురు, గణితంలో 34మందికి 29మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 21న వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తుది ‘కీ’ జూలై 2న విడుదల చేస్తామన్నారు. పరీక్ష నిర్వహణపై అభ్యంతరాలను ఈ నెల 26లోగా వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్లో తెలియజేయవచ్చని పేర్కొన్నారు. పరీక్షలను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆకుల రవితోపాటు ఎంజీయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ అల్వాల రవి, ఓఎస్డీ టూ వీసీ కొప్పుల అంజిరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి జి.ఉపేందర్‌రెడ్డి పర్యవేక్షణ చేశారు.