కట్టంగూర్, జనవరి 23 : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామానికి చెందిన గడ్డం వెంకట్ (29) వృత్తిరీత్యా డ్రైవర్. గత 15 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. వెంకట్ సంక్రాంతి పండుగకు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్లి గురువారం రాత్రి తిరిగి హైదరాబాద్ కు బయల్దేరాడు.
మార్గమధ్యంలో కట్టంగూర్ గ్రామ శివారులోని మద్రాసు ఫిల్టర్ కాఫీ దాటిన తర్వాత ముందున్న వాహనాన్ని దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు రోడ్డుపై పడ్డాడు. దీంతో అదే క్రమంలో వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెంకట్ పై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకట్ తల్లి యశోధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.