నకిరేకల్, ఏప్రిల్ 7 : కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ రజతత్సోవ సభను అడ్డుకునేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్-30 అమల్లోకి తీసుకువచ్చారని, ఎన్ని ఆంక్షలు విధించినా సభకు గులాబీ దళంతో కదం తొక్కుతామని, ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు.
ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పోస్టర్‌ను సోమవారం నకిరేకల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓ వైపు పార్టీ సమావేశాలు, మరో వైపు ప్రభుత్వ కార్యక్రమాలకు అనుమతి ఉండొచ్చు కానీ, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మాత్రం అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను అడ్డుకునేందుకు నెలరోజుల పాటు ర్యాలీలు, సభలు, ఊరేగింపులను నిషేధిస్తున్నట్లు వరంగల్ సీపీ ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో లాఠీదెబ్బలు తినని రంగమేదైనా ఉన్నదా?అని, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తల, న్యాయం కోసం ప్రశ్నించిన ప్రతి సామాన్యుడిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసులు పెడుతుందని విమర్శించారు.
ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై సందర్భం లేకుండా కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాసభ విజయవంతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ మాదధనలక్ష్మీనగేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, బీఆర్ఎస్ నకిరేకల్, కేతేపల్లి మండలాల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిల్వేరు ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ రాచకొండ వెంకట్‌గౌడ్, నాయకులు సోమ యాదగిరి, పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, గొర్ల వీరయ్య, యానాల లింగారెడ్డి, కట్ట శ్రవణ్, రాచకొండ శ్రవణ్, జంగయ్య, కౌన్సిలర్ పల్లె విజయ్, తదితరులు పాల్గొన్నారు.