సూర్యాపేట టౌన్, జనవరి 02 : ప్రజలు ఫ్రాడ్ కాల్స్ ను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో “ఫ్రాడ్ కాల్ పుల్ స్టాప్” అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఫ్రాడ్ కాల్స్ నిర్మూలన కోసం తెలంగాణ పోలీస్ ఫ్రాడ్ కాల్స్ పుల్ స్టాప్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. లోన్స్, బహుమతులు ఇస్తాం అని ఫోన్ కాల్స్ వస్తే అవి సైబర్ నేరగాళ్ల పన్నాగాలు అని గుర్తించాలన్నారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత కాల్స్‌కు లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు, 1930 కి సమాచారం ఇవ్వాలన్నారు. అజ్ఞాత ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని తెలిపారు. సైబర్ నేరాళ్లను అరికట్టడంలో ప్రజల సహకారం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.