నీలగిరి, జూలై 24 : నల్లగొండ జిల్లాలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురువనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా ప్రయాణ సమయంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున పరిమిత వేగంతో నడపాలని సూచించారు. చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదన్నారు.
అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంట్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోవద్దన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాల్వలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లవద్దన్నారు. నదులు, వాగుల్లోకి చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. పిల్లలను, వృద్ధులను ఒంటరిగా బయటకు పంపవద్దన్నారు. జిల్లా పోలీస్ శాఖ 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.