నేరేడుచర్ల, నవంబర్ 14 : మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించడమే పోలీస్ లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు, వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..పకడ్బందీ సేవలతో నేరాలను అదుపు చేయడంతో గతంలో కన్నా నేరాల సంఖ్య తగ్గిందన్నారు. సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వినియోగం, దొంగతనాలు దోపిడీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని నివారించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అశాంతి, అభద్రత భావం లేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు, హుజూర్నగర్ నియోజకవర్గంలో సేఫ్ హుజూర్నగర్ లక్ష్యంతో 150 నుండి 200 సీసీ కెమెరాలను, నేరేడుచర్లలో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించి సొంతంగా కూడా ఏర్పాటు చేసుకుని రక్షణకు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు, తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను, పరిపాలన విధానాన్ని, సిబ్బంది సేవలను, సమయ పాలన, వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కారం, తదితర వాటిని ఎస్పీ తనిఖీ చేశారు. రానున్న సంవత్సరంలో వీటిపై మరింత మెరుగైన సేవలందించడానికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు, ఎస్పీ వెంట డీఎస్పీలు శ్రీధర్ రెడ్డి, రవికుమార్, హుజూర్నగర్ సీఐ చరమందరాజు, నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ ఉన్నారు.

Nereducherla : మెరుగైన సేవలతో ప్రజలకు భరోసా : ఎస్పీ నరసింహ