మునుగోడు, సెప్టెంబర్ 23 : మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు అక్కరకు రాకుండా పోయిందని, సరైన మౌలిక సదుపాయాలు లేకుండా, సమస్యల వలయంలో ఉందని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేశ్ అన్నారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రంగా చెప్పుకోవడానికి మాత్రమే మునుగోడు వినిపిస్తుందని, కనీసం మండలంలో ఉన్నటువంటి పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి సరైనటువంటి ఆస్పత్రి లేకపోవడం దారుణమన్నారు. ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వివిధ చికిత్సల కోసం సుమారు 150 నుంచి 200 మంది వరకు వస్తుంటారని, కనీసం వారు తాగేందుకు మంచినీటి సౌకర్యం, మూత్రశాలలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేక ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటే కనీసం ఇంజక్షన్స్ అందుబాటులో లేకపోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని విధుల్లో పెట్టకపోవడం, ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉంటే ఒకరు మాత్రమే విధుల్లో ఉండి మరొకరు విధుల్లో లేకపోవడం, హోమియోపతి డాక్టర్ సైతం విధుల్లో లేకపోవడం, సిబ్బంది బాధ్యత రహితంగా ఉండటం వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. నిత్యం మునుగోడులో ఉండే స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఈ సమస్య కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలలో మునుగోడులో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ప్రజలను మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి, మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి నరేశ్, మండల ఉపాధ్యక్షుడు యాట శ్రీకాంత్, పగిళ్ల యాదయ్య, మండల నాయకులు బొందు శివ, కుక్కల మహేశ్ పాల్గొన్నారు.