Indiramma Illu | పెన్ పహాడ్, మార్చి 7 : వెనుకబడిన దుబ్బ తండాను ఇందిరమ్మ మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆర్డీవో వేణుమాధవ రావు తెలిపారు. పెన్‌పహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత తహశీల్దార్ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. మోడల్ విలేజ్‌గా తీసుకున్న దుబ్బ తండాను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు.
దుబ్బ తండాకు 19 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు పనులు పురోగతిలో ముగ్గులు పోయడానికే పరిమితం కావడం, నిర్మాణంలో జాప్యం కావడానికి గల కారణాలపై ఎంపీడీవో వెంకటేశ్వరరావుపై ఆర్డీవో మండిపడ్డారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన రిజిసర్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. త్వరలో జరగబోతున్న పదో తరగతి పరీక్షల కు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, అందుకు విద్యార్థులకు అదనపు క్లాసులు అందించాలని, ఉత్తమ రిజల్ట్ సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. వారి వెంట తహశీల్దార్ లాలునాయక్, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఎమ్మార్వో రంజిత్ రెడ్డి, ఏఆర్ఐ అజిజ, ఏపీవో రవి తదితరులు ఉన్నారు.