– పెంచిన వేతనాలు జనవరి నుండి అమలు చేయాలి
– సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెపల్లి సత్తయ్య
రామగిరి, ఏప్రిల్ 20 : మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో 690 గ్రామాలకు మంచినీరు అందిస్తున్న కార్మికులకు అతి తక్కువ రూ.10 వేల నుండి రూ.12 వేలు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, అవి కూడా నెల నెలా ఇవ్వకుండా ఆరు నెలలకు ఒకసారి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావునా ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధికారి సమక్షంలో కాంట్రాక్టులతో జరిగిన ఒప్పందం ప్రకారం పెంచిన వేతనాలను జనవరి నుండి అమలు చేస్తూ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని ఆ కార్పొరేషన్లో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులను కూడా చేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1న మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ల దగ్గర సిఐటియు జెండాలు ఎగురవేసి కార్మిక వర్గ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జంజరాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కుడ్తల సైదులు ఉపాధ్యక్షుడు నేలపట్ల అశోక్, కోశాధికారి ఉయ్యాల మురళి, శంకర్, ఆంజనేయులు, పరమేష్, కృష్ణ, సైదులు పాల్గొన్నారు.