నల్లగొండ, జూన్ 23 : కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, అలాగే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం నాయకులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్ టి ఎఫ్ ఐ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. 01.07.2023 నుండి అమలు కావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. NEP 2020 రద్దు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ పరీక్షలో వెయిటేజి ఇస్తూ ఆఫ్ లైన్ లో నిర్వహించాలని పేర్కొన్నారు.
పాఠశాలలను 4 వేలకు కుదించే ఆలోచన విరమించుకోవాలన్నారు. 2003 DSC ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులను ఈ నెల చివరి నాటికి అందజేయాలన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం రేపు నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాసాచారి, పెరుమాళ్ల వెంకటేశం కోరారు.