సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పెద్దిరెడ్డి రాజా సోదరుడు పెద్దిరెడ్డి కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కృష్ణ మాట్లాడుతూ టీడీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత రాజకీయాలు వద్దనుకున్నానని, నాటి నుంచి వ్యాపార రంగంలో కొనసాగుతున్నానని అన్నారు. తన అభిమాన పార్టీ అయిన టీడీపీని మించిన స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితుడయ్యానని తెలిపారు. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో చేసి చూపించిన బీఆర్ఎస్ పార్టీని కాదని, తన సోదరుడు పెద్దిరెడ్డి రాజా కాంగ్రెస్‌లో చేరడం ఇష్టం లేకనే గులాబీ పార్టీలో చేరానని చెప్పారు. సూర్యాపేటను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతూ ప్రశాంత వాతావరణంలో పాలన సాగిస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, నాయకులు పెండెం చంద్ర శేఖర్, బండారు రాజా, బైరు వెంకన్న, సయ్యద్ సలీమ్, అయూబ్ ఖాన్, గౌస్ పాల్గొన్నారు.
– సూర్యాపేట టౌన్, ఆగస్టు 4