తుంగతుర్తి, అక్టోబర్ 15 : తుంగతుర్తి మండల పరిధిలోని సంగేం గ్రామం వద్ద బుధవారం 60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. హమాలీలు పీడీఎస్ బియ్యం లోడ్ చేసుకుని వెంకపెళ్లి గ్రామంలోని డీలర్ షాపునకు తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సంగేం -వెంకపెల్లి గ్రామాల మధ్యలో ఉన్న ప్రధాన రహదారి నుండి అలుగు పోయడంతో నీటి ప్రవాహానికి ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. హమాలీలు, ట్రాక్టర్ డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా రెండు గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.