సూర్యాపేట, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకుల కోసం నిర్మించిన షెడ్డును కాంట్రాక్టర్ కబ్జా చేశాడు. వారం, పది రోజులపాటు షెడ్డును వినియోగించుకుంటామని అందులో చేరి అక్కడే తిష్ట వేశాడు. ఇప్పుడు గదిని ఖాళీ చేయకుండా కార్యకలాపాలు సాగిస్తుండడంతో రోగుల సహాయకులు ఎండ, వాన, చలికి ఇబ్బందులు పడుతూ చెట్ల కింద ఉండిపోతున్నారు. సూర్యాపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటవడంతో అత్యాధునిక వైద్య సేవల కోసం జిల్లా ప్రజలేగాక దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు.
గతంలో ఇక్కడ ఏరియా ఆసుపత్రిగా ఉండగా మెడికల్ కళాశాల రావడంతో జనరల్ ఆసుపత్రిగా మారి 350 పడకల ఆసుపత్రికి చేరింది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా వెయ్యి పడకల ఆసుపత్రికి కూడా అనుమతులు వచ్చాయి.
ఈ క్రమంలో ఇక్కడ ఆసుపత్రిని నిర్మించేందుకు టెండర్లు ఖరారు కాగా ఏడు నెలల క్రితం కాంట్రాక్టర్ సూర్యాపేటకు చేరుకొని స్థలాన్ని పరిశీలించి ఉద్యోగులు, నిర్మాణ కార్మికులతోపాటు సామాన్లు ఉంచేందుకు తాత్కాలిక షెడ్లు నిర్మించుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. అక్కడ రోగుల కోసం నిర్మించిన షెడ్డును తాత్కాలికంగా వాడుకుంటామని చెప్పి నెలలు గడుస్తున్నా ఖాళీ చేయడం లేదు. దాన్నే పధాన కార్యాలయంగా మార్చుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.
రోగుల వెంట వచ్చే సహాయకులు రాత్రిళ్లు ఉండేందుకు ఇబ్బంది పడకుండా గత ప్రభుత్వం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్‌తో కట్టిన గదినే ఈ కాంట్రాక్టర్ కబ్జా పెట్టాడు. దాంతో రోగుల సహాయకులు రాత్రిళ్లు, విజిట్ హవర్స్ లేని సమయంలో చెట్ల కింద, ఆరుబయట అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆ గదిని పేషెంట్ల సహాయకుల కోసం వినియోగించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. సీనియర్ డాక్టర్లు బదిలీపై వెళ్లడంతో తాను ఇటీవలే ఇన్చార్జి బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. పేషెంట్ అటెండెంట్ల కోసం నిర్మించిన షెడ్డు వివరాలు తనకు తెలియదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.