యాదగిరిగుట్ట, జూలై 21: రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురవాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో చేపడుతున్న ‘వర్ష పాశుపత వరుణ యాగం’ శాస్ర్తోక్తంగా సాగింది. రెండో రోజైన మంగళవారం యజుర్వేద, రుగ్వేద పండితులతో వేద మంత్ర పఠనం, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ యాగం సాగింది. వాస్తు మండపారాధన, నవగ్రహ మండపారాధన, లింగతోభద్ర మండపారాధన, యోగి మండపారాధన, క్షేత్ర పాలక మండపారాధన కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి.
కలశ స్థాపన చేపట్టిన అనంతరం రుష్య శృంగ విగ్రహస్థాపన చేపట్టి జపాలు, పారాయణాలు గావించిన అనంతరం అగ్నిప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. పూర్వాంగ విధులు శైవ సంప్రదాయ రీతిలో కొనసాగించారు. సాయంత్రం అభిషేకాలు చేపట్టి హావనములు గావించి అగ్నిని ప్రజ్వలింపజేశారు. పారాయణాలు, నీరాజన మంత్ర పుష్పాలు చేపట్టి అంతరాలయంలో శివుడికి జలదిగ్బంధనం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శివాలయంలో వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు శివాలయ ప్రధానార్చకులు, ప్రధాన పూజారులు వివరించారు. కార్యక్రమంలో ఈవో భవానీ శంకర్, శివాలయ ప్రధాన పూజారి గౌరీభట్ల సత్యనారాయణ శర్మ, ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహరాములు శర్మ, ఏఈవో దొమ్మాట సురేందర్‌రెడ్డి, ఆలయ పురోహితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.