నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ఇన్నిరోజులు హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు అంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగియనుంది. నేడు ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ర్యాలీలు, సభలతో నియోజకవర్గాలన్నీ సందడిగా మారనున్నాయి. నేటి సాయంత్రం తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులంతా ఇక కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించనున్నారు. ఇన్నాళ్లు చేసిన ప్రచారాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడం ఎట్లా అనేదే ఇప్పుడు కీలకం కానుంది. నేడు, రేపు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటింగ్ చేయించుకోవడమే ఏకైక లక్ష్యంగా కానుంది.
– నల్లగొండ ప్రతినిధి, మే10(నమస్తే తెలంగాణ)
మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ వెలువడగా గత నెల 18న నోటిఫికేషన్ వెలువడింది. దీని ప్రకారంగా ఈ నెల 13న పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల షెడ్యూల్ రాగానే అన్ని ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనే ఆచితూచి వ్యవహరిస్తూ బలమైన అభ్యర్థులుగా పరిగణించి రంగంలోకి దింపారు. బీఆర్ఎస్ ఎప్పటిలాగే సామాజిక సమతూకాన్ని పాటిస్తూ భువనగిరిలో బీసీ వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌ను, నల్లగొండలో సీనియర్ నేత కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా రంగంలోకి దింపింది.
కేసీఆర్ మార్గదర్శనంలో కేటీఆర్ పర్యవేక్షణలో రెండుచోట్లా ప్రచారంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థుల ప్రచారం, రోడ్‌షోల్లో వీలైనన్నీ ఎక్కువ చోట్ల జగదీశ్‌రెడ్డి పాల్గొంటున్నారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలు, మోసపూరిత హామీలను ఎండగట్టడంతో పాటు సమైక్య పాలనలో జిల్లా వెనుకబాటుతనానికి కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలే కారణమని ఎత్తి చూపుతూ వేడి పుట్టించారు.
అదే సమయంలో కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధి, దాని ఫలాలను మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ప్రాధాన్యతనిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను పునరావృతం కానివ్వదంటూ జిల్లా ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. అక్కడక్కడ కొందరు అధికారయావతో పార్టీని వీడుతున్నా, అసలుసిసలైన క్యాడరంతా పార్టీవెంటే ఉన్నారని, కష్టపడితే వాళ్లకే తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నామినేషన్ల సందర్భంగా భువనగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బహిరంగ సభలో పాల్గొని ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నల్లగొండలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారాన్ని భుజస్కంధాలపై వేసుకున్నారు.
పట్టణ, మండల కేంద్రాలను టార్గెట్ చేస్తూ అభ్యర్థులతో కలిసి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్లగొండలో, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భువనగిరిలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార సభల్లో పాల్గొన్నారు. భువనగిరిలో సీపీఎం అభ్యర్థి జహంగీర్ పోటీలో ఉండగా ఆ పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి ప్రచారంలో పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర అభ్యర్థులు సైతం తమ గుర్తులతో ప్రచారం కొనసాగిస్తున్నారు.
ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో ప్రధాన పార్టీల శ్రేణులు ఓటర్ల తలుపుతట్టుతున్నాయి. ఇంటింటికీ కరపత్రాలు, మోడల్ బ్యాలెట్ పేపర్లను పంచుతూ గుర్తులను చూపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నాయి. నేటి సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. ఆ తర్వాత ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రను నల్లగొండ లోక్‌సభ పరిధిలోని మిర్యాలగూడ నుంచే శ్రీకారం చుట్టడం విశేషం. గత నెల 24న బస్సుయాత్రగా బయల్దేరి సాయంత్రం 6గంటలకు మిర్యాలగూడ, 8గంటలకు సూర్యాపేట రోడ్‌షోల్లో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మర్నాడు 25వ తేదీ సాయంత్ర 7గంటలకు భువనగిరిలో రోడ్‌షోలో పాల్గొన్నారు.
కేసీఆర్ బస్సుయాత్రతో రెండు లోక్‌సభ స్థానాల్లోనూ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. ఇక అప్పటి నుంచి నేటి వరకు విస్తృత ప్రచారంలో మునిగిపోయారు. నోటిఫికేషన్ కంటే ముందే కేటీఆర్, హరీశ్‌రావు స్వయంగా సన్నాహక సమావేశాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ నెల 3న చండూరు, నల్లగొండలో హరీశ్‌రావు రోడ్‌షోలో పాల్గొన్నారు.