కట్టంగూర్, అక్టోబర్ 8 : తల్లిదండ్రులు తమ పిల్లలకు విలువలు నేర్పించాలని మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మసాగర్ అన్నారు. బుధవారం కట్టంగూర్ లోని సాందీపని స్కూల్, లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో కుటుంబ శ్రేయస్సు, బంధాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మద్యం మత్తులో తల్లిదండ్రులు, బిడ్డలు, కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు మరిచిపోవడంతో పాటు విచక్షణ కోల్పోయి దాడులు చేసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పెరిగిపోయి, ఆస్తి తగాదాలు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నాయన్నారు. పిల్లలు చెడు సహవాసాలు, వ్యసనాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.
క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునే స్వభావం తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా దానిని వీలైనంత త్వరగా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో తరుచూ మాట్లాడడంతో పాటు ప్రేమానురాగాలు, కుటుంబ విలువలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షుడు కల్లూరి వెంకన్న, సహాయ కార్యదర్శి బసవోజు వినోద్, సభ్యులు ఆకవరపు బహ్మచారి, ఉపాధ్యాయులు గట్టిగొర్ల యాదగిరి, రేణుక, పద్మ, శ్రీలేఖ, పావని, మంగ, అక్షాంక్ష, శ్రీలేఖ్య పాల్గొన్నారు.