సూర్యాపేట, మే 15 (నమస్తే తెలంగాణ) : అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న పలు పారాబాయిల్డ్ రైస్ మిల్లుల యాజమాన్యాలు భారీ దోపిడీకి తెరలేపుతున్నట్లు తెలుస్తున్నది. రెవెన్యూ రికవరీ యాక్ట్‌లోని లొసుగులను అదునుగా చేసుకొని వందల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఎగవేతకు సిద్ధం చేసినట్లు పలువురు మిల్లర్లే చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గత నాలుగైదు సీజన్లుగా ఒక్కో మిల్లు రూ.150 నుంచి రూ.200 పైనే విలువ చేసి ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ కోసం తీసుకున్నాయి.
వాటిలో 5 నుంచి 10 శాతం కూడా బియ్యం ప్రభుత్వానికి ఇవ్వని మిల్లులు 10 నుంచి 12 ఉన్నాయి. ఈ మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని గత పదిహేను రోజులుగా బయట తెగనమ్ముకుంటున్నారని, మరోవైపు మిల్లు యజమానులు, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను ఇతరుల పేరిట బదిలీ చేస్తున్నారని సమాచారం. ఎలాంటి కేసులు నమోదైనా కొద్ది రోజులు జైలులో ఉండి బెయిల్‌పై రావచ్చనేది వారి ఆలోచనలో భాగమని తెలుస్తున్నది.
కోదాడ సమీపంలోని ఓ మిల్లులో గతంలో సుమారు రూ.35 కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైతే యజమానిపై కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేశారు. ఆ మిల్లులో వందకు పైనే మంది పనిచేస్తుండడం, వారికి ఉపాధి కరువవుతుందనే కోణంలో కోర్టుకు వెళ్లి తిరిగి మిల్లును తెరిపించుకున్నారు. ప్రస్తుతం ఆ మిల్లునే జిల్లాలోని అక్రమార్కులు ఆదర్శంగా తీసుకుంటున్నారని ఓ మిల్లు యజమాని పేరు బహిర్గతం చేయడానికి నిరాకరిస్తూ పేర్కొన్నాడు. జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇప్పటికే రెండుగా చీలాయి. రెండు వర్గాల్లోని సుమారు 10 నుంచి 12 మిల్లులు గత నాలుగేండ్లుగా దాదాపు రూ.600 నుంచి రూ.700 కోట్ల విలువ చేసే ధాన్యం తీసుకున్నాయి.
కానీ సీఎంఆర్‌ను ప్రభుత్వ సంస్థలైన ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్‌కు అతి తక్కువగా ఇచ్చాయి. దాంతో ఆయా మిల్లులను అధికారులు డీఫాల్ట్‌గా ప్రకటించి ఈ సారి కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం కేటాయించలేదు. అంతే కాకుండా మిల్లుల్లో తనిఖీలు చేసి మూడు మిల్లులపై కేసులు కూడా నమోదు చేశారు. ఇక తమ ఆటలు చెల్లవనుకున్న అక్రమార్కులు ప్రభుత్వాన్ని మోసం చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు, అధికారులు ఎన్నికల బిజీలో ఉండడాన్ని అవకాశంగా తీసుకొని మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని ప్రైవేట్‌గా అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో మిల్లు యజమానులు తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను ఇతరుల పేరిట బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కేసులైన మిల్లులతోపాటు ఇతర మిల్లుల్లో యుద్ధప్రాతిపదికన తనిఖీలు చేసి అధిక బాకీలు ఉన్న మిల్లులకు కస్టోడియన్లను నియమిస్తే తప్ప అక్రమాలను అరికట్టడం కష్టమని పలువురు మిల్లర్లు చెబుతున్నారు. మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం మాయమవుతున్న విషయమై జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాములును ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.