నీలగిరి, నవంబర్ 24 : నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను యంత్రాంగం పూర్తి చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. బీసీకు 42శాతంతో సెప్టెంబరులో ప్రకటించిన రిజర్వేషన్లను హైకోర్టు నిలిపివేడయంతో గత రిజర్వేషన్ల శాతంతోనే తాజాగా బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం శనివారం జీవో 16 విడుదల చేసింది. దీంతో జిల్లా అధికారులు ఆదివా రం అర్ధరాత్రి వరకు డివిజన్ల వారీగా రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.
బీసీలకు 23 శాతం, ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 10శాతం చొప్పున రిజర్వేషన్లు తీసుకొని ప్రకటన చేశారు. కాగా జిల్లాలో 869 గ్రామ పంచాయతీల్లో బీసీలకు కేవలం 139 సీట్లు మాత్రమే రిజర్వు అయ్యాయి. 17శాతం కేటాయింపులున్న ఎస్పీలకు 153, 10శాతం రిజర్వేషన్ ఉన్న ఎస్టీలకు 192 సీట్లు రిజర్వు చేశారు. వీటిలో 114 పంచాయతీలు నూరుశాతం ఎస్టీ ఓటర్లు ఉన్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 164 స్థానాలు కేటాయించగా ఈసారి 139 సీట్లు మాత్రమే కేటాయించారు. 33 మండలాల్లోని 869 పంచాయతీలు, 7,494 వార్డుల్లో స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్టీలకు 192 (మహిళ-88, జనరల్-104) ఎస్సీలకు 153 (మహిళ-69, జనరల్-84), బీసీలకు 139 (మహిళ-61, జనరల్-78) ఓపెన్ కేటగిరిలో మహిళలకు 186, జనరల్‌కు 199 మొత్తంగా 385 కేటాయించారు.

