ఆకాశంలో మబ్బు పడితే చాలు రైతుల వెన్నులో వణుకు పుడుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎక్కడ వర్షానికి నెలపాలవుతుందోనని అన్నదాతలు కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కుప్పులు తెప్పలుగా పేరుకుపోయిన ధాన్యం నిల్వలు వర్షానికి తడిసి మొలకెత్తితే కోలుకోలేమని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్రం ప్రభుత్వం చోద్యం చూస్తోందని, చస్తేగాని.. ధాన్యం కొనరా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంస్థాన్ నారాయణపురం, జూన్ 5: ఖరీఫ్ మొదలైనా ధా న్యం కొనే నాథుడు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా ఇంకా 50 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతోంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ, నారాయణపురం గ్రామాల్లో రెండు వ్యవసాయ సహకర కేంద్రాలున్నాయి. గుజ్జ పీఏసీఎస్ పరిధిలో సర్వేల్, పుట్టపాక, గుజ్జ, నారాయణపురం పీఏసీఏస్ పరిధిలో గుడిమల్కాపురం,నారాయణపురం, వెంకాంబావి తండా, జనగాం, చిల్లపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు రెండు నెలల క్రితమే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల మాయజాలంతో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం అధికారులు పని తీరుకు నిదర్శనం. లారీలు రావడం లేదు. మిల్లర్లు తీసుకుపోవడం లేదని అధికారులు సాకులు చెబుతున్నారు తప్ప ప్రత్యామ్నా యంపై దృష్ఠి సారించడం లేదు. నాలుగు రోజులుకు ఒకసారి లారీలు అన్లోడ్ అయి తిరిగి వస్తుండడంతో ధా న్యం మొత్తం కొనుగోలు చేయడానికి ఇంకా నెల రోజుల సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు పడుతుండటంతో రైతులు ఓ వైపు పొలం పనులు చేస్తూ మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. లారీల సంఖ్య పెంచి త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
కండ్లలో నెత్తురు కారుతోంది
అప్పులు చేసి పంట సాగు చేసిన. పంట అమ్మితే వచ్చిన పైసలతో అప్పులు కడుదామని అనుకున్న. మార్కెట్లో ధాన్యం పోసి 40 రోజులైంది. ఇంత వరకు కాంటా వేయలేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని చూస్టుంటే కండ్లల్లో నెత్తురు కారుతోంది. వర్షాలు వస్తున్నాయి. పొలం దున్ని.. నారు పోయాలంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అధికారులు పట్టించుకుని తొందరగా ధాన్యం కొనుగోలు చేయాలని మనవి.
-బైకని విజయ్‌కుమార్, యువ రైతు
రాత్రిపూట నిద్ర పడతలేదు
మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైపోయింది. మార్కెట్ మొత్తం ధాన్యం కుప్పలతో నిండిపోవడంతో చెరువులో స్థలం చూపిస్తే అక్కడ ధాన్యం పోసిన. రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. చెరువులోకి నీళ్లు వస్తే పంట మొత్తం మట్టి పాలవుతుంది. కష్టపడి పండించిన పంట ఏమవుతుందో అని రాత్రిపూట నిద్ర పడతలేదు. ఎంత బతిమిలాడినా కాంటా వేస్తలేరు. పెద్దసార్లు పట్టించుకుని తొందరగా కాంటా వేయిస్తే పుణ్యం ఉంటుంది.
-ఎడ్ల శంకరయ్య, రైతు
అరిగోస పడుతున్నం
పండించిన పంటను అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నం. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక రాత్రింబగళ్లు సెంటర్ దగ్గరే పడిగాపులు కాస్తున్న. అధికారులు రేపుమాపు అంటూ సాకులు చెబుతున్నారు. నాలుగు రోజులకు ఒక లారీ వస్తే.. ధాన్యం మొత్తం అయిపోయే సరికి ఇంకా నెల రోజులు పట్టేట్టు ఉంది. లారీల సంఖ్య పెంచి ధాన్యం తొందరగా కొనుగోలు చేసేలా అధికారులు చొరువ తీసుకోవాలి.
-నరేందర్ యాదవ్, రైతు