తుంగతుర్తి, జూన్ 08 : తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం చూపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఐకెపి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసి రెండు నెలలు దాటినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. వర్షాకాలం మొదలై వారం రోజులు గడుస్తున్నా కళ్లంలో ధాన్యం అలాగే ఉన్నాయని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పుకుంటూ ప్రజలను, రైతులను ముంచే ప్రభుత్వంగా మారిందని మండిపడ్డారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తల్లపెల్లి యాకయ్య, పిట్టల ఎల్లయ్య, శంకర్, బర్ల పరమేశ్, పిట్టల సతీష్, సోమయ్య పాల్గొన్నారు.