నత్త నడకన.. ధాన్యం కొనుగోళ్లు.. కాంటాల కోసం రైతుల ఎదురుచూపులు
మండలంలో ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 25 రోజులు పైగా ధాన్యం పోసి రోజుల తరబడి వేచి చూసినా కాంటా వేయకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చినా తూకం వేసేవారు లేకపోవడంతో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు.
- 2,61,683 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
- కొనాల్సిన ధాన్యం సుమారు 4,42,753 క్వింటాళ్లు
భూదాన్ పోచంపల్లి, మే 24 : మండలంలో ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 25 రోజులు పైగా ధాన్యం పోసి రోజుల తరబడి వేచి చూసినా కాంటా వేయకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చినా తూకం వేసేవారు లేకపోవడంతో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రైతులు తకువ ధరకు ధాన్యం అమ్ముకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే నిర్వహణా లోపం, అధికారుల నిర్లక్ష్యం , హమాలీల కొరత , లారీల సమస్యతో కొనుగోళ్లు జరగడం లేదు. నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ ఉన్నా మూడు నాలుగు రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. తేమ వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సమస్య ఎదురవుతోంది. దీంతో తూకం వేయడానికి 10 రోజులు పైగా వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.
తూకం వేసేటప్పుడు బస్తాకు రెండు కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ , తాలు శాతం ఎకువగా ఉందని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తీసిన తరుగు కంటే అదనంగా క్వింటాల్‌కు నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు తీస్తుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మండలంలో మొత్తం 39 పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మండలంలో 2,61,683 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రైసు మిల్లులకు తరలించారు. ఇంకా 4,42,753 క్వింటాళ్ల ధాన్యం కొనాల్సి ఉంది. ఈసారి ధాన్యం ఆలస్యంగా రావడంతో ఈనెల మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కాంటా వెయ్యక పోవడంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యపు రాసులు పేరుకు పోయాయి. కాంటా వేసినా ధాన్యం మిల్లుల వద్ద వెంటనే దిగుమతి కాకపోవడం, రోజుల తరబడి వేచి చూడటం, కాంటా వేసిన ధాన్యం సకాలంలో లారీలు తీసుకెళ్లక పోవడంతో రైతులు అరి గోస పడుతున్నారు. బస్తాకు రూపాయి చొప్పున లారీ వాళ్లు తీసుకుంటున్నారని, లేదంటే ధాన్యం తీసుకెళ్లడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
హైబ్రిడ్ విత్తనాలతో ఈసారి అధికంగా పంట వచ్చింది. ఎకరానికి 90 బస్తాల దిగుబడి వచ్చింది. ఎకరానికి 80 బస్తాలు తీసుకోవాలని అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని రైసు మిల్లులో ఇతర ప్రాంతాలకు చెందిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. స్థానిక రైసు మిల్లర్లు మండలానికి సంబంధించిన ధాన్యాన్ని తీసుకున్న తర్వాతే మిగతా మండలాల వారివి తీసుకోవాల్సి ఉంది. దీంతో గోదాములో స్థలం లేక హమాలీల కొరతతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. ఈనెల 25న రోహిణి కార్తీ ప్రవేశిస్తుండటంతో దున్నకాలు ప్రారంభించాలని రైతు లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ధాన్యం అమ్ముడు పోక, పంటల సాగు పెట్టుబడికి దికులు చూడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. రైతు భరోసా అందించినా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే దుస్థితి ఉండేది కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశంలో మబ్బులు చూసి గుబులు పుడుతోందని, వర్షాలు పడితే ధాన్యం మొలకెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంటా కోసం రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి ప్రతి రోజూ నిరీక్షిస్తున్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో చాలా చోట్ల ధాన్యం రాసులు పేరుకు పోయాయి. అధిక కాంటాలు వేయడం, కాంట వేసిన ధాన్యం లారీలో మిల్లులకు తరలించే ప్రక్రియ వేగవంతం చేస్తేనే కొనుగోళ్లు వేగంగా జరుగుతాయని, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తరుగు పేరుతో రైస్ మిల్లర్ల దోపిడీ!
- లారీలోని ఒక బస్తాకు రూ.3
- క్వింటాల్‌కు హమాలీకి రూ.45
- క్వింటాల్‌కు 5 కిలోలు తరుగు
చందంపేట, మే 24 : జిల్లాలోని రైతులకు అగచాట్లు తప్పడం లేదు.. కొనుగోలు కేంద్రంలోనే రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతుల్కు లారీల కొరతతో పాటు కొనుగోలు కేంద్రం, మిల్లర్ల తరుగు తీస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. వారితో పాటు మా వాటా అంటూ హమాలీలు, బస్తాకో రేటు ఫిక్స్ చేసి లారీల యజమానులు నిలువునా దోచుకుంటున్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతులు కమీషన్లు, తరుగు పేరుతో ఇబ్బందులు పడక తప్పడం లేదు. చందంపేట మండలం పోలేపల్లి, గుంటిపల్లి వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి ఇది.
బస్తాకు రూ.3 చొప్పున రేటు..
రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు లారీలోకి ఎక్కించాలంటే లారీకి ఒక రేటు, లారీలోకి బస్తాకు ఒక రేటు ఉండగా హమాలీలకు మరో రేటు ఫిక్స్ చేసి రైతులను అందిన కాడికి దోచుకుంటున్నారు. వీరికి తోడు మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో సుమారుగా క్వింటాల్‌కు 5 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. ఒక రైతు 400 బస్తాల ధాన్యం తెస్తే బస్తాకు రూ.3 చొప్పున రూ.1200 ఇవ్వాల్సిందే. అలాగే హమాలీలకు క్వింటాకు రూ.45 చొప్పున చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులకు 20 రోజులు దాటినా బస్తాలు ఇవ్వడం లేదని, దీంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు పోలేపల్లి కొనుగోలు కేంద్రం వద్ద సరైన వసతుల్లేకపోవడంతో సుమారు 250 మంది రైతులకు సంబంధించి 11వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
20 రోజులు దాటినా బస్తాలు ఇవ్వడం లేదు..
ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చి 20 రోజులు దాటింది. మ్యాచర్ వచ్చినా బస్తాలు ఇస్తలేరు… వడ్లను కొంటలేరు. రేపు మాపంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప ధాన్యం కొంటలేరు. 250 బస్తాలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదు. అనవసరంగా కొనుగోలు కేంద్రానికి వచ్చినట్లు ఉంది.
-పల్లా నారాయణరెడ్డి, రైతు,పోలేపల్లి
రైతులకు న్యాయం చేయండి
మారెట్లో ధాన్యం పోసి మూడు రోజులు ఎండబెట్టి శుభ్రం చేశాం. 387 బస్తాలయ్యాయి. ముక ఉందని చెప్పి లారీలో ధాన్యం ఎత్తకపోతే బతిమిలాడినా. 70 బస్తాలు కట్ చేస్తామంటే బతిమిలాడితే 45 బస్తాలు కట్ చేశారు. తాలు, తేమ, ముక పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తుర్రు. రైతులకు న్యాయం చేయండి.
-బొంగు పద్మాగౌడ్, సీతవానిగూడెం, భూదాన్ పోచంపల్లి
ధాన్యం పోసి 20 రోజులైంది..
ధాన్యంపోసి 25 రోజులైంది. బస్తా కేజీ 41.800 కిలోలు కాంటా వేస్తున్నారు. బస్తా పేరిట రెండు కిలోల తరుగు, లారీ యజమానులు బస్తాకు రూపాయి చొప్పున వసూలు చేస్తుండ్రు. తాలు, తేమ ఉందని మిల్లర్లు కోత పెడుతున్నారు. ప్రధానంగా లారీల సమస్య, ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ జరుగుతలేదు. కొనుగోలు కేంద్రం నుంచి రెండు లారీలు పోతున్నాయి. పోయిన లారీలు తిరిగి వస్తలేవు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిని వెంటనే చేయాలి. కేసీఆర్ హయాంలోనే ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగాయి.
-నోముల మాధవరెడ్డి, రైతు ఇంద్రియాల
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

