Paddy Procurement | సూర్యాపేట, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ఈ యాసంగి సీజన్లో సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు రాకపోవడంతో లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. మిగిలిన కొద్దిపాటి పంటను శతవిధాలా ప్రయత్నించి కాపాడుకున్న రైతులకు మార్కెట్లో మద్దతు ధర కరువైంది. ఓ వైపు వరి కోతలు జోరుగా సాగుతుండగా ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం తెరుచుకోలేదు. దాంతో మిల్లర్లు, దళారులు చెప్పిందే చెప్పిందే ధరై కూర్చుంటున్నది. కాగా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే గతం కంటే ధాన్యం తక్కువ వస్తుంది.. ఎండిన పంట లెక్క తేలుతుందని తెరువడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇరవై రోజుల వ్యవధిలో అధికారులు మూడు సార్లు మీటింగ్ పెట్టి చర్చించారు తప్ప ఒక్కటంటే ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదు. ఇప్పటికే జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టులో 50 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో 30 శాతం పూర్తయ్యాయి. ఒక్క గోదావరి ఆయకట్టు పరిధిలోనే 2.50లక్షల్లో రైతులు వరి నాటు పెట్టగా, సాగునీరు లేక లక్ష ఎకరాలకు పైగా ఎండిపోయింది.
ఉన్న కొద్దిపంటనైనా కాపాడుకోవాలని రైతులు నానా కష్టాలు పడ్డారు. లక్షల రూపాయలు అప్పులు చేసి బోర్ల మీద బోర్లు వేశారు. వాటిల్లోనూ నీళ్లు రాకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి తడులు అందించారు. తీరా కొద్దోగొప్పో చేతికి వచ్చిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా మిలర్లు, వ్యాపారులు సిండికేట్ అయ్యి ధర తగ్గించి రైతులను దోచుకుంటున్నారు.
జోరుగా వరి కోతలు… కనిపించని కొనుగోలు కేంద్రాలు
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఇరవై రోజుల నుంచి వరి కోతలు నడుస్తున్నాయి. కాళేశ్వరం పరిధిలో గోదావరి ఆయకట్టు ఉన్న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో వారం క్రితం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 30 శాతం పూర్తయ్యాయి. కానీ, నేటికీ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దాంతో రైతులు గత్యంతరం లేక ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మద్దతు ధర క్వింటాకు రూ.2,302తోపాటు బోనస్ 500 కలిపి రైతుకు రూ.2,800 వరకు వస్తుంది.
కానీ, మిలర్లు మాత్రం రూ.2వేల నుంచి 2,200కి మించి ధర పెట్టడం లేదు. కోతలు ఊపందుకుని ధాన్యం లోడ్లు వస్తున్న కొద్దీ ధర తగ్గిస్తున్నారు. మరోవైపు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో దొడ్డు రకం ధాన్యానికి మోడల్ ప్రైస్ రూ.1,900లోపే ఉంటున్నది. పైగా తేమ, బస్తా పేరిట రెండు కిలోల తరుగు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల కోసం సమావేశాలు పెట్టిన జిల్లా అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం విస్మయం గొల్పుతున్నది.
ఐకేపీ కేంద్రం పెట్టకపోవడం వల్ల 56 వేలు నష్టపోయాను
ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు తెరువకపోవడంతో నేను పండించిన 142 క్వింటాళ్ల దొడ్డు రకం వడ్లను మిల్లుకు అమ్ముకున్నా. కింటాకు రూ.1,900 ధర మాత్రమే ఇచ్చారు. ఏవో కాకి లెక్కలు చెప్పి రూ.4,500 విలువ చేసే రెండున్నర కింటాలు తరుగు తీసి 140 క్వింటాలకు డబ్బులు కట్టిచ్చారు. అదే ఐకేపీ సెంటర్లో అమ్ముకుని ఉంటే మద్దతు ధర రూ.2,302 దక్కేది. తరుగు ఉండకపోయేది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల 56వేల రూపాయలు నష్టపోయాను.
-కన్నెబోయిన మల్లేశ్, రైతు, నాగారం