మినీ స్టేడియం నిర్మాణానికి రూ.3.75 కోట్లు
ఓపెన్ డ్రెయిన్ ఆధునీకరణకు రూ.15 కోట్లు
హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు
హాలియా, మే15 : హాలియా మున్సిపాలిటీకి మహర్దశ పట్టనున్నది. హాలియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 40 కోట్లు విడుదల చేయగా.. తాజాగా శనివారం మంత్రి కేటీఆర్ మరో రూ. 18.75 కోట్లను మంజూరు చేశారు. దాంతో పట్టణంలో అభివృద్ధి ఇక పరుగులు పెట్టనున్నది. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి జరుగుతుండడంతో మున్సిపల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దోమల బెడదకు చెక్…
గత పాలకుల వైఫల్యం కారణంగా హాలియాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దాంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. వీటి ఆధునీకరణకు మంత్రి కేటీఆర్ రూ. 15 కోట్లు మంజూరు చేయడంతో ఈ సమస్య తీరనున్నది. హాలియాలో మినీ స్టేడియం నిర్మాణం ఈ ప్రాంత క్రీడాకారులు, యువతీ యువకులు, సీనియర్ సిటిజన్స్, వాకర్స్ కల. గత పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 2018లో స్టేడియం నిర్మాణం కోసం దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష నాయకులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.3.75 కోట్లతో మినీ స్టేడియం నిర్మించనుండడంతో యువతీయువకులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పరుగులు
హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 40 కోట్లు విడుదల చేసింది. వాటితో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనగా పట్టణంలో మినీ స్టేడియం, ఓపెన్ డ్రెయిన్ల కోసం మరిన్ని నిధులు కావాలని ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. దాంతో స్పందించిన మంత్రి మున్సిపాలిటీలో ఓపెన్ డ్రెయిన్ల అభివృద్ధికి రూ. 15 కోట్లు, హాలియాలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ.3.75 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా నిధులతో ఇక పట్టణంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి.
ఫిట్‌నెస్‌కు వీలు కలుగుతుంది
మినీ స్టేడియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ రూ.3.75 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. హాలియాలో స్టేడియం నిర్మిస్తే క్రీడాకారులు, యువతీ యువకులు ఆటలు ఆడుకునేందుకు, పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రాక్టీస్‌కు వీలుగా ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు గ్రౌండ్లేక ఇన్ని రోజులు పడ్డ ఇబ్బందులు తీరనున్నాయి.
– పిల్లి వెంకట్, హాలియా
దోమల బెడద పోతుంది
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా హాలియాలో మురుగు కాల్వ లు అస్తవ్యస్తంగా మారాయి. దోమల బెడద ఎక్కువగా ఉంది. కాల్వలు సరిగా లేక మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తున్నది. ప్రభుత్వం డ్రెయినేజీల ఆధునీకరణకు రూ. 15 కోట్లు మంజూరు చేయడం అభినందనీయం.
–చెరుపల్లి ముత్యాలు, హాలియా
ఎమ్మెల్యే తోడ్పాటు అభినందనీయం
మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే నోము ల భగత్ తోడ్పాటు అభినందనీయం. ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిలర్లతో కలసి వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేయించారు.
– నల్లగొండ సుధాకర్, మున్సిపల్ వైస్‌చైర్మన్