యాదాద్రి భువనగిరి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల(ఓపీఎస్)కు వేతనాలు సకాలంలో అందడం లేదు. నెలనెలా చెల్లించాల్సిన వేతనాలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. సెక్రటరీలతో పనిచేయించుకుం టూ రెన్యువల్ మాత్రం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1056 మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నా రు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 48 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. నాలుగేండ్లుగా పనిచేస్తున్న వీరికి.. ఏటా రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం రెన్యువల్ చేయలేదు. అయినప్పటికీ పనులు చేయించుకుంటున్నారు. ఒక్కరోజు రాకున్నా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అలాంటిది జీతం మాత్రం సకాలంలో ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా ల్లో రెన్యువల్ చేయగా మరో 10 జిల్లాల్లో పెండింగ్లో పెట్టారు.
నల్లగొండ జిల్లా ఓపీఎస్లకు కూడా రెన్యువల్ చేసి, జీతాలు ఇచ్చినట్లు సెక్రటరీలు చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇంకా ఫైల్ క్లియర్ కాలేదని, హైదరాబా ద్ స్థాయిలో ఆగిందని చెబుతున్నారు. బడ్జెట్ ఉన్నప్పటికీ రెన్యువల్ ఆర్డర్ రాకపోవడంతో జీతాలు రావడంలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో అసలు జీతాలే చెల్లించలేదు. అంటే ఏడు నెలలుగా జీతాలు రావడంలేదు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వీరందరికీ అరకొరగానే జీతాలు చెల్లిస్తారు. కనీస వేతనాలు కూడా లేకుండా అతి తక్కువ జీతాలతోనే వీరు పనిచేస్తున్నారు.ఒక్కో ఉద్యోగికి రూ. 15వేల నుంచి రూ. 20వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.
జీతాలు రాకపోవడంతో ఓపీఎస్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో పైసల్లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఇం టి అద్దెలు, నిత్యావసరాలకు తిప్పలు తప్పడం లేదు. పిల్లల ఫీజుల చెల్లింపులు భారం అవుతున్నది. ఈఎంఐలు కట్టలేక సతమతమవుతున్నారు. వేతనాలు రాకపోవడంతో ఒక్కొక్కరికి రూ.లక్ష పైనే బకాయిలు ఉన్నాయి. వేతనాల కోసం పలు దఫాలుగా అధికారులకు వినపత్రాలు సమర్పించినా లా భం లేకుండా పోయింది. సకాలంలో జీతా లు అందితేనే కుటుంబాలను కష్టంగా వెళ్లదీసే కా లంలో..అసలు వేతనాలే రాకపోవడంతో ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించేవారని గుర్తు చేస్తున్నారు.
నాలుగేండ్ల క్రితం నియమితులైన ఓపీఎస్లకు జీతాలు సకాలంలో అందడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాలు చెల్లించలేదు. ఔట్ సోర్సింగ్ కావడంతో సకాలంలో రెన్యువల్ చేయలేదు. ఏడు నెలల తర్వాత ఈనెల మూడో తేదీన రెన్యువల్ ఆర్డర్ ఇచ్చారు. కొనసాగింపు ఉత్తర్వులు లేకపోవడంతో సెక్రటరీలకు జీతాలు ఆగిపోయాయి. వేతనాలు రాక ఓపీఎస్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రెన్యువల్ ఆర్డర్స్తోపాటు జీతాలు ఇప్పించేలా చొరవ తీసుకోవాలి.
– శశికాంత్ గౌడ్, పంచాయతీ సెక్రటరీల ఫోరం, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు