సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 10 : ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి పాదాచారులకు, పౌరులకు, వాహనదారులకు ఇబ్బందులు తొలగించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సిబ్బందికి సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీస్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, పునరుద్దరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పట్టణ కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను సర్దుబాటు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఆధునీకరించాలని, వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐలు సాయిరాం, అంజిరెడ్డి పాల్గొన్నారు.