సిరిసిల్లలో ఇటీవల హత్యకు గురైన నేత కార్మికుడు వెంగల వెంకటేశం కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక వ్యూహాత్మకంగా.. పకడ్బందీగా ప్లాన్‌తో హత్య చేసిన విధానం, ఆపై ఏమీ ఎరగనట్టు ప్లే చేసిన డ్రామాలు చూస్తే.. ఓ క్రైం కిల్లర్ సినిమాను తలపిస్తున్నది. వెంకటేశం చావును అడ్డు పెట్టుకొని, బీఆర్ఎస్ను బద్నాం చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కళ్ల బైర్లు కమ్ముతున్నాయి. హస్తం పార్టీకి చెందిన నాయకులే అందులో కీలకపాత్ర పోషించడంతోపాటు హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తమ రాజకీయ స్వార్థం కోసం ఓ సామన్య కార్మికుడిని అడ్డు తొలగించుకోవాలని చూసిన సదరు నాయకులు ప్రస్తుతం అడ్డంగా దొరికిపోగా.. దీని వెనుక కేవలం వీరి పాత్రే ఉన్నదా..? ఇంకా హస్తం పార్టీకి చెందిన ప్రధాన నాయకుల పాత్ర ఏమైనా ఉన్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వెంకటేశం మృతి కార్మికవర్గాల్లో కలకలం రేపుతుండగా.. విచారణను ఇక్కడికే పరిమితం చేయకుండా.. దీనికి వెనుకున్న ప్రధాన సూత్రధారులను లాగేందుకు పోలీసులు మరింత చొరవ చూపాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నేత కార్మికుడు వెంగల వెంకటేశం హత్య ఒక క్రైమ్ స్టోరీని తలపిస్తున్నది. ఓ సామాన్య కార్మికుడిని హత మార్చేందుకు వేసిన మాస్టర్ ప్లాన్‌ను నిశితంగా చూస్తే.. ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే వెంకటేశం హత్య కేసులో కంపెనీ యజమాని కుసుమ గణేశ్, కాంగ్రెస్ నాయకుడు మార్గం లక్ష్మణ్‌తోపాటు శ్రీనివాస్, రమేశ్, సూర్యప్రకాశ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఈ హత్య వ్యవహారంలో వీరు మాత్రమే ఉన్నారా..? లేక దీని వెనుక ఇంకా పెద్ద మాస్టర్‌మైండ్ ఎవరిదైనా ఉందా..? అన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. వెంకటేశం హత్య ఉదంతాన్ని లోతుగా చూస్తే.. దీని వెనుక పెద్ద తతంగమే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. తన భర్త ఉదయం నుంచి కనిపించడం లేదని పేర్కొంటూ వెంగల వెంకటేశం భార్య సులోచన పోలీసులకు ఈ నెల 6న ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో ఈ నెల 8న రగుడు ప్రాంతంలో వెంకటేశ్ మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో గుర్తించారు. ఆ మేరకు విచారణ చేపట్టి, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. వెంకటేశం కనిపించకుండాపోయిన రోజునే అతడితో కలిసి తిరిగిన కుసుమ గణేశ్ (కంపెనీ ఆసామి)ను గుర్తించారు. గణేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. వెంకటేశం తన వద్దే పనిచేస్తుండేవాడని, చెప్పా పెట్టకుండా గైర్హాజరు అయ్యేవాడని, పనిలో నుంచి తీసివేస్తే.. వెంకటేశం భార్య వచ్చి కంపెనీ వద్ద గొడవ చేసేదని, దీని వల్ల వెంకటేశం నుంచి ఎదో విధంగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్టు విచారణలో గణేశ్ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
అందుకోసం కాంగ్రెస్ నాయకుడు మార్గం లక్ష్మణ్‌తో కలిపి ప్లాన్ చేసిననట్టు గుర్తించారు. ఎలా హత్యచేయాలో ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. బట్టల డయ్యింగ్లో ఉపయోగించే నైట్రాస్ పొడి ఆహారంలో కలిపి తిన్నా.. లేదా ఏదైనా పానీయంలో కలిపి తాగినా మరణిస్తారని తెలుసు. ఆ మేరకు నైట్రాస్ పొడిని విస్కీలో కలిపి వెంకటేశంతో తాగించి చంపవచ్చని ప్లాన్ వేశారు. ఆ మేరకు గతంలోనే కొనుగోలు చేసిన ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిల్లో నైట్రాస్ పొడిని కలిపారు. ఈ నెల 6న వెంకటేశానికి ఫోన్‌చేసి మద్యం తాగేందుకు రావాలని గణేశ్ పిలిచాడు. అప్పుడప్పుడు వీరికి తాగే అలావాటు ఉంది. గణేశ్ మాటలు నమ్మి వెంకటేశ్ సరే అని ఒప్పుకొన్నాడు. ప్లాన్ ప్రకారమే ఆర్టీసీ బస్సులో రగుడు వరకు వెళ్లిన గణేశ్.. నైట్రాస్ పొడి కలిపిన విస్కీని వెంకటేశ్‌తో తాగించాడు. కొద్దిసేపటికే వెంకటేశం కింద పడిపోయాడు. అతడు చనిపోయాడని భావించిన నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొద్దిరోజుల ముందుకెళ్తే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సంబంధించి మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ తన భార్య రూ.లక్ష లంచం అడిగారని పేర్కొంటూ వెంకటేశ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఎలాగైనా వెంకటేశంను తప్పించాలని అలోచిస్తున్న కంపెనీ యజమాని గణేశ్‌తోపాటు లక్ష్మణ్ ఈ అవకాశాన్ని వాడుకోవాలని భావించారు. వెంకటేశంను హత్య చేసి దార్ల సందీప్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రికరించేందుకు ప్లాన్ వేశారు. దీంతో ఈ వ్యవహారం దార్ల సందీప్ వైపు విషయం మళ్లుతుందని భావించారు. కాంగ్రెస్ నాయకుడు మార్గం లక్ష్మణ్.. దార్ల సందీప్ మధ్య కూడా రాజకీయ వైరం కొనసాగుతున్నది. గతంలో జరిగిన ఎన్నికల్లో లక్ష్మణ్.. సందీప్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ హత్యను సందీప్‌పై తోసేస్తే.. ఆయన పదవిపోతుందని, తద్వారా తనకు ప్రత్యర్థి లేకుండాపోతారని ఇరువురు భావించినట్టు పోలీసులు విచారణలో తేలింది.
ఆమేరకు హత్యచేసిన వారే.. తమకేమి తెలియనట్టు కొత్త డ్రామాకు తెరలేపారు. అనుమానాస్పదంగా మృతిచెందినట్టు తెలిసినప్పుడే.. కాంగ్రెస్ నాయకులు మొదట వెంకటేశం మృతదేహాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఇంటి ఎదుట వేసి ఆందోళన చేసేందుకు హంగామా చేశారు. ఇది ఇలా నడుస్తుండగానే.. పోలీసులు వెంకటేశ్ మృతదేహాన్ని పరిశీలించే సమయంలో.. అతడి జేబులో ఏదో రాసి ఉందంటూ హత్యచేసిన వ్యక్తులే చెప్పారు. ‘అది మీకెలా తెలుసు?’ అని పోలీసులు అడిగిన ప్రశ్నలకు.. రకరకాలుగా సమాధానాలు చెప్పారు. ఇక్కడ అనుమానించిన పోలీసులు.. వెంకటేశం జేబు నుంచి నోట్ తీసి చూశారు. అందులో ‘నాకు దార్ల సంపత్తో భయం ఉంది’ అని రాసి ఉంది. ఆ నోట్‌ను వెంకటేశ్ భార్యకు చూపించగా.. తన భర్తకు చదువుకోలేదని, అలాంటప్పుడునోటు ఎలా రాస్తాడని ఆమె చెప్పడంతో పోలీసులకు అనుమానాలు బలపడ్డాయి. దీంతో గణేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిజానికి ఈ సూసైడ్ నోటును రెండో తరగతి చదువుకున్న గణేశ్ రాసి మృతిడి జేబులో పెట్టిన విషయం వెలుగు చూసింది. అంటే విషం ఇచ్చి హతమార్చి.. ఆపై సూసైడ్ నోట్‌రాసి.. హత్యను బీఆర్ఎస్ వాళ్లవైపు మళ్లించి, బద్నాం చేసే కుట్రలకు ప్లాన్చేసిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వెంకటేశం హత్య వ్యవహారంలో కంపెనీ ఆసామి కుసుమ గణేశ్, కాంగ్రెస్ నేత మార్గం లక్ష్మణ్‌తో పాటు శ్రీనివాస్, రమేశ్, సూర్యప్రకాశ్‌ను అరెస్టు చేయగా.. అందులో గణేశ్, లక్ష్మణ్ జైలుకు వెళ్లారు. మరో ముగ్గురికి కోర్టులో బెయిల్ వచ్చింది. అయితే హత్య ఉదాంతం తీరును వివరిస్తూ.. ప్రస్తుతం ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాని పోలీసుల కోర్టును ఆశ్రయించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటే.. హత్య ఉదంతం యావత్తు క్రైం సినిమాను తలపిస్తున్న నేపథ్యంలో.. అందులో వీరి పాత్ర మాత్రమే ఉన్నదా..? లేక దీనికి వెనుక ఇంకా ఎవరిదైనా మాస్టర్ మైండ్ ఉన్నదా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఈ కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపాలన్న డిమాండ్ వస్తున్నది. గతంలో క్రిమినల్ ఆలోచనలు చేసిన కొంత మంది వ్యక్తులు కూడా ఈ హత్య ఉదంతంలో ఉన్నారు. అలాంటప్పుడు.. వారికి ఎక్కడి నుంచో ప్రేరణ వచ్చి ఉంటుదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, దీని వెనుక హస్తం పార్టీకి చెందిన కొంత మంది పెద్దల సహాయ సహకారాలు ఉండి ఉండవచ్చన్న చర్చ నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో.. సిరిసిల్లలో సినిమాను తలపించే ఈ క్రైంను ఇక్కడితోనే సరిపెట్టకుండా.. మరింతలోతుగా విచారణ జరిపించాలన్న డిమాండ్ వస్తున్నది. దీని ద్వారా అసలు సూత్రధారులు బయటకు వస్తే.. మరోసారి ఇటువంటి ఘటన తిరిగి పునరావృతం కాకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.