నల్లగొండ : దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా గ్రామాలకు నేరుగా నిధులిస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్‌పల్లి మండలం చిన్నతుమ్మలగూడెం గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకుందని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని, ప్రభుత్వం సమకూర్చిన నిధులను బాధ్యతగా ఖర్చు చెయ్యాలన్నారు.
వచ్చే నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తామని తెలిపారు. అన్నివర్గాల ప్రజల బాగోగులను ఇంటికి పెద్దలా కాపాడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.