యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): అందరికీ అన్నం పెట్టే రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వరుణుడు.. ఇంకో వైపు సర్కారు నిర్లక్ష్యం తో అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వడ్ల సేకరణను గాలికొదిలేసింది. అరకొరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకుంటున్నది. సెంటర్లు ప్రారంభించిన చోట కూడా ఇంకా కాంటా వేయడం లేదు. రైతులు చేసేదేమీ లేక ప్రైవేట్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఒక్కో క్వింటాకు రూ.600 నుంచి 800 నష్టంతో అమ్మకుంటున్న దుస్థితి నెలకొంది.
కొన్నది 8027 మెట్రిక్ టన్నులే..
జిల్లాలో యాసంగి సీజన్లో 3.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 6.90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా. పౌర సరఫరాల అధికారులు మాత్రం నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందు కోసం జిల్లాలో 358 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించారు. కరెంట్ కోతలు, సాగునీరు లేక ఇప్పటికే సగం పంటలు ఎండిపోయాయి. అష్టకష్టాలు పడి.. వచ్చిన దిగుబడిని అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడా ఇబ్బందులు తప్పడంలేదు.
జిల్లాలో ఇప్పటి వరకు 221 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభించిన చోట కూడా కాంటాలు వేయడంలేదు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఇంకా కొనడంలేదు. అధికారిక లెక్కల ప్రకారం 22వ తేదీ నాటికి 825 మంది రైతుల నుంచి 8027 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో సన్నరకం ఒక్క గింజ కూడా లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ పోసిన ధాన్యం అక్కడే కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. మరోవైపు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం లేదు.
క్వింటాల్‌కు రూ.1600 నుంచి 1800 మాత్రమే..
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం చేస్తుండటం, తేమ పేరుతో కొర్రీలు పెడుతుండటంతో రైతులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారుల దగ్గర అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ రకం క్వింటా రూ. 2389 ఉండగా, రూ. 1600 నుంచి రూ. 1800 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే క్వింటాల్‌కు రూ.600 నుంచి రూ. 800 రైతులు నష్టపోతున్నారు. అంతే కాకుండా తరుగు తీస్తున్నారు. అయినప్పటికీ వర్షాల భయంతో రైతులు ప్రైవేట్‌లోనే అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వరుణుడి భయంతో అన్నదాత ఆందోళన..
ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ఊపందుకున్నాయి. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు వాటిని నిత్యం ఆరబెట్టి రాత్రిపూట కుప్పలు కడుతున్నారు. శుక్రవారం పలు చోట్ల అకాల వర్షం కురిసింది. కొన్ని చోట్ల బస్తాలు తడిసిపోయాయి. మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఇలాంటి సమయంలో ధాన్యం రాశులు నిలిచిపోవడంతో వర్షం వస్తే ఇంకింత తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉందని రైతులు టెన్షన్ పడుతున్నారు.
ధాన్యం కొనుగోలు తీరు ఇలా..