యాదాద్రి భువనగిరి, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : నాడు భూమికి పచ్చని రంగేసినట్లు పంట పొలాలు.. అంతటా జల సవ్వడులు.. నిండు కుండలా చెరువులు.. సర్కారు సాయం.. సరిపడా ఎరువులు.. రైతుల మోముల్లో ఆనందాలు.. కానీ.. నేడు.. విడువని కాళేశ్వరం జలా లు.. సవ్వడి లేని సాగర్ ఆయకట్టు.. నిండుకున్న చెరువులు.. పత్తాలేని సాగు నీరు.. ఎండిపోతున్న పొలాలు.. ఎరువుల కొరత.. కరువు ఛాయలు.. సర్కారు సాయం ఎగవేత.. అప్పుల బాధలు.. పట్టింపులేని ప్రభుత్వం.. వెరసి రైతుల ఆత్మహత్యలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.
మళ్లీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు దాపురించాయి. పదేండ్ల పాటు సంతోషంగా బతికిన రైతులు బక్కచిక్కి పోతున్నారు. కర్షకులు దుఃఖసాగరంలో మునిగి తేలుతున్నారు. కాలం కలిసి రాక కొందరు.. సాగు చేయక నష్టపోగా.. మరికొందరు అప్పులు చేసి చేసి పొలం చేసినా అనేక కారణాలతో పంట చేతికందని దుస్థితి ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులో అత్యధికంగా అప్పుల బాధ తాళలేక ప్రాణాలు తీసుకున్నారు. నల్లగొండలో 18మంది, యాదాద్రి భువనగిరిలో ఐదుగురు, సూర్యాపేటలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యలకు గల కారణాలను రాజకీయ నిపుణులు, రైతు సంఘాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధానంగా యాసంగిలో రైతు భరోసా ఎగవేత, సకాలంలో పెట్టుబడి సాయం అందించకపోవడం, అరకొరగా రుణమాఫీ, గతంలో మాదిరి యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు కాళేశ్వరం జలాలు అందించకపోవడం, నాగార్జున సాగర్ ఆయకట్టులో నీటి విడుదల లేకపోవడం, కరెంట్ కష్టాలు, ధాన్యం కొనుగోళ్లలో విఫలం తదితర అనేక కారణాలతో రైతులు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. నల్లగొండ జిల్లాలో మంగళవారం బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ పర్యటించనుంది. నల్లగొండ పట్టణంలో జరుగనున్న బీఆర్ఎస్ మహాధర్నాలో పాల్గొననుంది. అక్కడే రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి భరోసా ఇవ్వనుంది. అనంతరం వివిధ ప్రాంతాల్లోని రైతుల కుటుంబాలను సందర్శించనుంది. కర్షకుల ఆత్మహత్యలకు గల కారణాలను అధ్యయనం చేయనుంది. ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పనుంది.