అర్వపల్లి, సెప్టెంబర్ 11 : రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ మధు నాయుడు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ పెండింగ్, చెక్ బౌన్స్ కేసులు, చిన్నపాటి వివాదాలు, ఇతర రాజీ చేయదగిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు తమపై ఉన్న పెండింగ్, రాజీ చేసుకునే అవకాశం ఉన్న కేసుల విషయంలో సంబంధిత పోలీసు అధికారులను లేదా న్యాయ సేవా సంస్థ అధికారులను సంప్రదించి, జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియకు ముగింపు పలికే అవకాశం ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ కోరారు.