న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 : అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారతీయ పేమెంట్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో తమ యాపిల్ పే సర్వీస్‌ను బుధవారం ప్రారంభించింది. దీంతో ఎక్కడైనా (స్టోర్లు, సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్ తదితరాల్లో) ఐఫోన్, ఐపాడ్, యాపిల్ వాచ్‌లను వాడుతున్న భారతీయ యూజర్లు ఇక ఈ నయా పేమెంట్స్ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఫలితంగా గుగూల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన పేమెంట్స్ యాప్‌లకు పోటీగా మరొకటి వచ్చినైట్టెంది. అయితే యాపిల్ పే.. యాపిల్ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తుల వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో దీని వాడకం కొంత తక్కువగానే ఉంటుందన్న అంచనాలున్నాయి.
యాపిల్ పే అనేది యాపిల్ డిజిటల్ పేమెంట్ సర్వీస్. దీనిద్వారా చెల్లింపులు చేయడానికి యాపిల్ యూజర్లు.. యాపిల్ వ్యాలెట్ యాప్‌నకు సూచించిన డెబిట్, క్రెడిట్ కార్డులను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా ప్రస్తుతానికైతే యాక్సిస్ బ్యాంక్ జారీచేసే వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకే ఈ యాపిల్ పే సర్వీస్ ఉన్నది. ఈ ఏడాది ఆఖర్లోగా మరిన్ని బ్యాంకులతో టై-అప్ అవుతామని యాపిల్ సంస్థ చెప్తున్నది. అలాగే త్వరలోనే మ్యాక్ నోట్‌బుక్స్ వినియోగదారులకూ ఈ సౌకర్యాన్ని (మ్యాక్ సపోర్ట్ యాపిల్ పే) కల్పిస్తామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.