తుంగతుర్తి, జూన్ 24 : ఎస్.ఐ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ భూఖ్య హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 25 నుండి భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి వచ్చే బిఎల్వో లకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. బిఎల్వోలతో పాటు ప్రతి పార్టీ నుండి ఒక బీఎల్ఎ (బూత్ లెవెల్ ఏజెంట్) ను నియమించినట్లు తెలిపారు. బిఎల్వోలు అడిగిన సమాచారాన్ని వారికి అందించి ఓటర్లు తమ ఓటును కాపాడుకోవాలన్నారు. ఎస్ ఐ ఆర్ ముఖ్య ఉద్దేశం డూప్లికేట్ ఓట్లను, చనిపోయిన వ్యక్తుల ఓట్లు తొలగించడం జరుగుతుందన్నారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎస్ ఐ ఆర్ అవగాహన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ దయానందం, డిప్యూటీ తాసీల్దార్ కంటమయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎస్ఐఆర్ పై అవగాహన కలిగి ఉండాలి : భూక్య హరిసింగ్