మునుగోడు, జూన్20 : ఎస్ఐఆర్ (సర్) పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలిగిస్తూ వస్తోందని, ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ర్రెడ్డి పిలుపు నిచ్చారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలకు కష్టాలే మిగిలాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. శనివారం మునుగోడులో నియోజకవర్గ ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ పెట్టాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఏకమైనా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఆయన సభలో పార్టీ సభ్యత్వ నమోదు, సర్‌పై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఇటీవల చేపట్టిన అనేక సర్వేలు బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా నుంచి తొలిగించకుండా చూడాలని సూచించారు. ఓట్లు మాయం చేసే పార్టీల పట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
సర్ ప్రకియపై అప్రమత్తంగా ఉండాలి..ఆర్ఎస్పీ
ఎస్ఐఆర్ (సర్) ప్రకియపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్చార్జి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. మునుగోడులో శనివారం బూత్ లెవల్ ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో కేంద్రంలోని బేజేపీ ప్రభుత్వం ప్రతి పక్ష పార్టీల ఓట్లు తొలిగిస్తోందని, ఈ విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఇంటింటి గణనను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. జూలై 31న విడుదల చేసే ముసాయిదా ఓటరు జాబితాను క్షుణంగా పరిశీలించాలని, పొరపాట్లు ఉంటే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 95 లక్షల ఓట్లను తొలిగించి బీజేపీ అధికారంలో వచ్చిందన్నారు. సర్ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గానికి వందల కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
భయపడేదిలేదు.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ శ్రేణలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదిరించి పోరాడుతున్నామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అధికార పారీ ్టబెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదేన్నారు. తమకు కేసులు కొత్తకాదన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమన్నారు. ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మునుగోడు ఎమ్మెల్యేకు మంత్రి పదవిపై ఉన్న ధ్యాస నియోజకవర్గ అభివృద్ధిపై లేదన్నారు.
మళ్లీ కేసీఆర్ రావాలి.. మాజీ ఎంపీ బడుగుల
జిల్లాలో ఎక్కడకు వెళ్లినా.. ఎక్కడ చూసినా ..జనమంతా మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి క్యామ మల్లేశ్, సర్ నియోజవర్గ ఇన్చార్జి గోపగోని వెంకటనారాయణ గౌడ్, పల్లె రవికుమార్, పాల్వాయి సవంత్రి, మునగాల నారాయణరావు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల నాయకులు, పార్టీ మండల అధ్యక్షుడు మందుల సత్యం, పగిళ్ల సతీష్, పోలగోని సైదులు, బాలరాజు గౌడ్, సర్పంచ్‌లు నన్నూరి భూపతిరెడ్డి, సాంబయ్య, మదన బోయిన పరమేశ, నల్లగొండ అంజి, ఈద శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.