అనంతగిరి, నవంబర్ 21 : ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ తోటలను సాగు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బుర్రా నరసింహారెడ్డి రైతులను కోరారు. అనంతగిరి మండలంలోని గొండ్రియాలలో వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో నిర్వహించిన ఆయిల్ పామ్ సాగు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్నట్లు చెప్పారు. డ్రిప్ పరికరాలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఓసీ రైతులకు 80 శాతం రాయితీ వస్తుందని తెలిపారు.
రైతులు ఆయిల్ పామ్ పంట వేసిన తర్వాత అంతర పంటల సాగు, ఎరువుల నిమిత్తం ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు ప్రభుత్వం అందజేయనున్నట్లు వివరించారు. ఒక్కసారి నాటితే పంట దిగుబడి 3వ సంవత్సరం నుంచి మొదలై 30 ఏళ్ల పాటు ప్రతినెలా ఆదాయం వచ్చే ఏకైక పంట ఆయిల్ పామ్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ ప్రాంతీయ ఉద్యానవన అధికారి పి.అనిత, విస్తరణ అధికారి రంగు ముత్యంరాజు, పతంజలి ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్, సంఘ డైరెక్టర్ నెల్లూరి వెంకటప్పయ్య, క్షేత్ర సహాయకులు బి.లక్ష్మణ్, వెంకటరత్నం, రైతులు నెల్లూరి వినయ్, చుంచు గురవయ్య, యడ్లపలి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.