నిడమనూరు, జులై 10 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో పారిశుధ్య నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. పంచాయతీల్లో ఎక్కడ చూసినా పారిశుధ్య నిర్వహణపై అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. మండల ప్రత్యేకాధికారి, సంబంధిత అధికారులు నామమాత్రపు సమీక్షలు నిర్వహించి మమ అనిపిస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో మురుగు కాల్వలు శుభ్రపరిచే పరిస్థితి లేక డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయింది. వీధులు మురికి కూపంగా మారి దుర్వాసనను వెదజల్లుతున్నాయి. వీధుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నా పిచ్చి మొక్కల తొలగింపును పట్టించుకునే నాధుడు కరువయ్యాడు.
నిధుల లేమి పేరుతో పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణను కార్యదర్శులు విస్మరించడంతో వీధుల్లో చెత్త దర్శనమిస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులు పట్టణాల్లో నివాసముంటూ చుట్టపు చూపుగా పంచాయతీలకు వెళ్తున్న కారణంగా చిన్నపాటి అవసరమొచ్చినా, సౌకర్యాల కల్పన కోసమైనా కార్యదర్శుల కోసం వ్యయ ప్రయాసల కోర్చి మండల పరిషత్‌కు చేరుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో నెలకొన్న పారిశుధ్యం లోపాన్ని నిర్మూలించేందుకు పర్యవేక్షించాల్సిన అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పారిశుధ్య నిర్వహణను తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Nidamanoor : పర్యవేక్షణ పట్టని అధికారులు.. పారిశుధ్యం అస్తవ్యస్తం