నకిరేకల్, అక్టోబర్ 22 : నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి 20 రోజులు, అవి ప్రారంభించడానికి మరో 20 రోజులు పడుతుందని ఎద్దేవా చేశారు. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారని, తడిచిన ధాన్యం కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని చీమలగడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
గన్ని వ్యాగులు లేవని, కాంటాలు సరిపడా లేవని ఏదో ఒక సాకు చూపి ధాన్యం కొనకపోవడం దుర్మార్గం అన్నారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పటివరకు సక్రమంగా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని, సమయానికి రైతు బంధు ఇవ్వడం లేదని, రెండు సంవత్సరాల నుండి సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదన్నారు. అధికారులు, మిల్లర్ల మధ్య సమన్వయ లోపం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకుని అధికారులు, మిల్లర్లను సమన్వయం చేసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రెవెన్యూ భూములపై మోజు ఉంటుందే తప్పా రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని, వారికి నష్టం జరగకుండా చూడాలని సోయి లేదన్నారు.
రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ముందస్తుగా కేంద్రాలు ఏర్పాటు చేయడం , మిల్లర్లను అలాట్ చేయడం, బ్యాగులను ఏర్పాటు చేయడం, కేంద్రాల్లో సరైన వసతులు కల్పించాలన్నారు. కల్లాల దగ్గర రైతులను పడుకో పెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిల్వర్ ప్రభాకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, ఇమడపాక వెంకన్న, మాజీ సర్పంచ్ శెట్టిపల్లి జానయ్య, నాయకులు ధైర పరమేశం, యానాల వెంకటరెడ్డి, గొర్ల వీరయ్య, రాచకొండ శ్రవణ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్ పాల్గొన్నారు.