నకిరేకల్, అక్టోబర్ 21 : ధాన్యం కొనుగోళ్లలో కమిషన్‌తో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ధాన్యం సేకరణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా ఆశించిన ఫలితం కనబడడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతానికి పైగా మహిళలకు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో 99 శాతం మంది సభ్యులు వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలే ఉంటారు. వారికి వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అయినా కొనుగోలు కేంద్రాలను మహిళలకు ఎందుకు కేటాయించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకిరేకల్ మండలంలోని 12 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్క సెంటర్ కేటాయించకుండా తమను అవమానించారని మహిళలు విమర్శలు చేస్తున్నారు.
నకిరేకల్ మండలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 27 మహిళా గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. వీటిలో 767 మహిళా పొదుపు సంఘాల్లో 7,545 మంది సభ్యులుగా ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా నకిరేకల్ మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్, ఎన్డీసీఎంఎస్ లకు ధీటుగా సమర్థవంతంగా నడిపిస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదించి పెట్టినా నకరేకల్ మండలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా మహిళా సమాఖ్యలకు కొనుగోలు కేంద్రం కేటాయించకపోవడం సెర్ప్, డీఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. మండలంలో తాటికల్లు, చీమలగడ్డ 1, చీమలగడ్డ 2, చందుపట్ల, మంగళపల్లి, వల్లభాపురం, నెల్లిబండ కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్‌కు కేటాయించారు. ఓగోడు, టేకులగూడెం 1, టేకులగూడెం 2, కేంద్రాలు ఎన్డీసీఎంఎస్కు అప్పగించారు. చందంపల్లి, కడపర్తి కేంద్రాలను ఎఫ్పీఓలకు అప్పగించారు. మొత్తం 12 కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కటి మహిళా సమాఖ్యలకు కేటాయించకపోవడం వెనుక ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహిళా పొదుపు సమాఖ్యలకు వచ్చే ఆదాయాన్ని రానీయకుండా పీఏసీఎస్, డీసీఎంఎస్‌లకు కట్టబెడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు.
ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ, కొనుగోలు కేంద్రాల్లో మహిళల భాగస్వామ్యం పెంచితే మహిళలే ధాన్యాన్ని విక్రయించి నిల్వ చేసి, మరాడించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేయొచ్చని, దీంతో మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయాలనే దిశగా ఆలోచన చేస్తున్నప్పటికీ నకిరేకల్ నియోజకవర్గంలో మాత్రం సెర్ప్, డీఆర్డీఏ అధికారులు కొనుగోలు కేంద్రాలను మహిళా సమాక్యలకు కేటాయించాలని ప్రతిపాదన పంపక పోవడం గమనార్హం. ఎండీ సి ఎం ఎస్, పీఏసీఎస్‌లలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువెత్తుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సొసైటీ కార్యదర్శి, సిబ్బంది సస్పెన్షన్లకు గురవుతున్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తరుగు, తాలు, తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో పాలకవర్గం జోక్యం కూడా మితిమీరుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలులో పీఏసీఎస్, ఎన్డీసీఎంసీల సంఖ్యను తగ్గించి మహిళా స్వయం సహాయక సంఘాలకు కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని పెంచితే వారికి కమీషన్ రూపంలోనూ లబ్ధి చేకూరి మహిళా సంఘాలు బలోపేతం అవుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
– 2020- 21 సంవత్సరంలో ఐదు కొనుగోలు కేంద్రాలు కేటాయించగా 93,03,374 క్వింటాల ధాన్యం విక్రయించగా రూ.29.27 లక్షల కమీషన్ వచ్చింది.
– 2020- 21 సంవత్సరంలో 9 కొనుగోలు కేంద్రాలు కేటాయించగా 1,79,458 క్వింటాళ్ల ధాన్యం విక్రయించగా రూ. 60.23 లక్షల కమీషన్ వచ్చింది.
– 2021- 22 సంవత్సరంలో 5 కొనుగోలు కేంద్రాలు కేటాయించగా 69,771 క్వింటాల ధాన్యం విక్రయించగా రూ.22.51 లక్షల కమీషన్ వచ్చింది.
– 2021- 22 సంవత్సరంలో 6 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించగా 81,264 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయగా రూ.26.00 లక్షల కమీషన్ వచ్చింది.
– 2022- 23 సంవత్సరంలో 6 కేంద్రాలు కేటాయించగా 98,717 క్వింటల ధాన్యం విక్రయించగా రూ.37.51 లక్షల కమీషన్ వచ్చింది. తర్వాత మహిళా సమాఖ్యలకు ఏ ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటాయించలేదు.
గతంలో ప్రతి సీజన్ కు ఐదు కేంద్రాలకు తగ్గకుండా మహిళలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించేవారు. మా సమాక్య తరపున ఐదుసార్లు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నడిపించాం. ప్రతి సీజన్ కు 5 లక్షల ఆదాయం చూపించే వాళ్ళం. వచ్చిన కమీషన్ తో సంఘం సభ్యులకు కిరాణా షాపు, లేడీస్ టైలర్స్, గేదెల పెంపకం, కోళ్ల పెంపకం కోసం తిరిగి రుణాలు ఇచ్చే వాళ్లం. ఈ సీజన్లో నకిరేకల్‌లో ఇంతవరకు ఒక్క కొనుగోలు కేంద్రం కేటాయించలేదు. ఒక్క కేంద్రం కూడా మహిళా సమాఖ్యలకు కేటాయించకుండా మహిళలను అధికారులు అవమానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళలకు కొనుగోలు కేంద్రాలు కేటాయించాలి.
గత రెండేళ్ల నుండి మహిళా సమాఖ్యలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించనందున ఈ సీజన్లోనూ ప్రతిపాదనలు పంపలేదు. వచ్చే సీజన్ యాసంగిలో ధాన్యం కొనుగోలుకు ప్రతిపాదనలు పంపి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తాం. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నాం.