కేతేపల్లి, మే 27 : అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాల్వనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని చెర్కుపల్లిలో కృష్ణ సముద్రం చెర్వు ప్రాంతంలోని ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలించేందుకు అధికారులు కాంట్రాక్టర్కు ఇటీవల అనుమతి ఇచ్చారు. సంబంధిత కాంట్రాక్టర్ స్థానిక అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి నిబంధలనకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు మొదలు పెట్టాడని రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రదేశంలో కాకుండా తనకు అనువైన ప్రాంతాన్ని సదరు కాంట్రాక్టర్ ఎన్నుకున్నాడు.
ఈ క్రమంలో గ్రామానికి ఆయువు పట్టుగా ఉన్న మూసీ కుడికాల్వకు అడ్డుగా మట్టి పోసి కార్యకలాపాలు సాగిస్తున్నారు. బుధవారం వరద ప్రవాహం పెరగడంతో కాల్వకు అడ్డంగా మట్టి పోసిన ప్రదేశం కాల్వ నీటితో పూర్తిగా నిండిపోయింది. దీంతో కాల్వ నుంచి నీరు రోడ్డు మీదుగా ప్రవహిస్తోంది. ప్రవాహం ఎక్కువైతే కాల్వ పూర్తిగా తెగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వందల ఎకరాల్లో పంట నష్ట పోయే పరిస్థితి వస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మూసీ కుడి కాల్వలో నీటి ప్రవాహం పెరిగిన విషయం తెలుసుకున్న సంబంధిత వ్యక్తులు కాల్వకు అడ్డుగా పోసిన మట్టిని తొలగించారు.
మూసీ కుడి కాల్వను మట్టితో పూర్తిగా మూసివేసి అక్రమంగా మట్టిని తరలించడాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి అక్రమ తవ్వకాన్ని తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. నిబంధలకు విరుద్ధంగా ఎక్కువ లోతులో తవ్వకాలు చేపడుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఈ విషయమై అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే మట్టి తవ్వకాలను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.